Telangana CM Revanth Reddy Gratitude Tweet : రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న సందిగ్ధతకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. పార్టీ అధిష్ఠానం ఎట్టకేలకు రేవంత్ రెడ్డిని పేరును ఖరారు చేస్తూ ప్రకటన జారీ చేసింది. హస్తం పార్టీ ఎమ్మెల్యేల ఏకవాక్య తీర్మానం మేరకు అందరూ ఊహించినట్టుగానే రేవంత్ రెడ్డి సీఎల్పీ(CLP Leader) నేతగా, తదుపరి సీఎంగా పగ్గాలు అప్పగిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా తనను ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పార్టీలోని అగ్రనేతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్కంఠ వీడింది, ఊహించిందే జరిగింది - రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పగ్గాలు
గౌరవనీయలైన ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ, తనలో నిత్యం స్ఫూర్తినింపిన నాయకుడు రాహుల్‌గాంధీ, ఛరిష్మా గల నాయకురాలు ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో(DK Shiva Kumar) పాటు రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కష్టసుఖాల్లో అండగా నిలిచిన లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్‌చేశారు. సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా రేవంత్ తన ట్వీట్లో అభివర్ణించారు.
టీపీసీసీ పదవి ఇప్పుడే మార్చే అవకాశం లేనట్లే :ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటించడం స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు రవి తెలిపారు. రేవంత్ రెడ్డితో మరికొంత మంది ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రేవంత్ రెడ్డికి ఉన్న పీసీసీ(TPCC) పదవి ఇప్పటికిప్పుడు మార్చే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీలో పదవులు కష్టపడ్డవారికి లభిస్తాయన్నారు.