సీఎం సుదీర్ఘ కసరత్తు
నేడు కేబినెట్ భేటీ - శాసన సభ
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను నేడు మంత్రివర్గం ఆమోదించనుంది. ఎన్నికల హామీల అమలు దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌పై సుదీర్ఘ కసరత్తు చేశారు.
ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలు, కేటాయింపులపై విస్తృత స్థాయి కసరత్తు చేశారు. ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఎన్నికల హామీల అమలు దిశగా కేటాయింపులు ఉండాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం మొదటిసారి కేబినెట్ సమావేశంలో కేసీఆర్ నూతన అమాత్యులకు ప్రభుత్వ ప్రాధాన్యాలకు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు. గ్రామ పంచాయతీ రిజర్వేషన్లపై ఇప్పటికే ఆర్డినెన్స్‌ను జారీ చేసిన ప్రభుత్వం బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. జీఎస్టీ సవరణల బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
నిధుల కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు, ఆసరా పింఛన్లకు రూ. 30 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి పారుదల శాఖకు రూ.25 వేల కోట్ల వరకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. సీఎం కేసీఆర్ లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి రూ. 24 వేల కోట్లు అవసరమని అంచనాకు వచ్చారు. అయితే రుణమాఫీ ఏ విధంగా చేస్తారో చూడాల్సి ఉంది. నిరుద్యోగ భృతి, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు, వేతన సవరణ తదితర అంశాలపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటాన్ అకౌంట్‌కు నాలుగు లేదా ఆర్నెళ్ల కాలానికి సర్కారు అనుమతి తీసుకునే అవకాశం ఉంది.