Telangana Assembly Sessions Starts From Today : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సభలో ఇరుకున పెట్టేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులతో సిద్ధమవుతున్నాయి. ఈ విడత... మూడు, నాలుగు రోజులు సమావేశాలు ఉండొచ్చని భావిస్తున్నారు.బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12న ముగిశాయి. ఆరు నెలల్లో కనీసం ఒకసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఈరోజు నుంచి జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.
Telangana Assembly Monsoon Sessions 2023 : మూడు, నాలుగు రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చునని భావిస్తున్నారు. ఇవాళ ఉదయం కంటోన్మెంట్ దివంగత శాసనసభ్యుడు సాయన్నకు సంతాపం వ్యక్తం చేయనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. అందులో సమావేశాలు ఎన్నిరోజులు జరపాలనే అంశం ఖరారు కానుంది. ఎన్నికలు నవంబరు లేదా డిసెంబరులో జరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఇవే చివరి సమావేశాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ... అసెంబ్లీ, మండలిలోనూ దూకుడుగా వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నాయి.
వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్న పార్టీలు : వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలనికాంగ్రెస్, బీజేపీ వ్యూహ రచన కాగా.. విపక్షాల ఎత్తులను తిప్పికొట్టడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సభా వేదికగా ప్రజల ముందుంచాలని అధికార పార్టీ ప్రతివ్యూహం.భారీ వర్షాలు, వరదలకు ప్రాణ, పంట నష్టం, ధరణి, డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు వంటి అంశాలను ప్రస్తావించాలని ప్రతిపక్షాలు ప్రణాళిక చేస్తున్నాయి. మరోవైపు ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ వైఖరి, రాష్ట్రానికి కేంద్ర సాయం వంటి అంశాలను లేవనెత్తి విపక్షాలపై ఎదురుదాడికి అధికార పార్టీ సిద్ధమవుతోంది. మూడు, నాలుగు రోజుల పాటు గత సమావేశాలకు భిన్నంగా వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ తిప్పి పంపిన నాలుగు బిల్లులను మళ్లీ సభలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ చర్చ సందర్భంగా కేంద్రం, బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తాలని బీఆర్ఎస్ భావిస్తోంది.