Telangana Assembly Sessions 2022: తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన తర్వాత తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్‌రెడ్డిలకు శాసనసభ సంతాపం తెలిపింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభలో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు రెండు నిమిషాల మౌనం పాటించారు. అంతకుముందు స్పీకర్ మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌రెడ్డి సేవలను కొనియాడారు. ఆ తర్వాత సభను 12వ తేదీకి వాయిదా వేశారు.
అనంతరం సమావేశాల అజెండా ఖరారుపై బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 12, 13 తేదీల్లో శాసనసభ సమావేశాలు జరపాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశాలు ఎక్కువ రోజులు జరపాలని కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కోరగా.. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల దృష్ట్యా తర్వాత చూద్దామని ప్రభుత్వం తెలిపింది. పని దినాలు బాగా తగ్గుతున్నాయని అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొనగా.. పని దినాలు తగ్గినా ఎక్కువ సమయం నడుపుతున్నామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కొన్ని బిల్లులు, తీర్మానాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చిద్దామని అధికార పక్షం తెలపగా.. రైతులు, నిరుద్యోగం, ధరలు, వరదలపై చర్చించాలని కాంగ్రెస్ కోరింది. మైనార్టీల సమస్యలు, హైదరాబాద్ అంశాలపై చర్చించాలని మజ్లిస్ పార్టీ కోరింది.