ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంతో నది మొత్తాన్నే మళ్లించే యత్నం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)లో వాదించింది. ‘రోజుకు 80 వేల క్యూసెక్కుల నీటి మళ్లింపు అంటే సుమారు 8 టీఎంసీల నీరు. ఆ మొత్తం నీటితో దేశం మొత్తానికి తాగు నీరు సరఫరా చేయొచ్చు’ అని వివరించింది. ఈ పథకానికి పర్యావరణ అనుమతులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పూర్తి అసంబద్ధంగా ఉందని స్పష్టం చేసింది.
పర్యావరణ అనుమతులు అవసరం లేదని
పర్యావరణ అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల చేపడుతోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ అంశంపై ఎన్జీటీ నియమించిన నిపుణుల కమిటీ రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని నివేదిక ఇచ్చింది. దానిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సైబల్ దాస్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు, సీనియర్ న్యాయవాది సంజీవ్ కుమార్‌లు సుమారు రెండు గంటలపాటు తమ వాదనలు వినిపించారు.
మరో వైపు కొత్త ఆయకట్టు
‘‘ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యాన్ని భారీగా పెంచింది. మరో వైపు కొత్త ఆయకట్టు లేదని, తాగు నీటి ప్రాజెక్టు అని అంటోంది. వాస్తవానికి అదనంగా పది లక్షల ఎకరాల ఆయకట్టును పెంచి నీరు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కృష్ణా నది జలాలను కృష్ణా బేసిన్ అవసరాలకు వినియోగించాలి. ఇక్కడ మాత్రం పెన్నా బేసిన్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మాసనం అనుమతిస్తే అక్కడి వాస్తవ పరిస్థితులను హెలికాప్టర్‌లో తీసుకెళ్లి చూపుతాం’’ అని తెలిపారు.