Governor tweet on students: విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని రాష్ట్ర గవర్నర్ తమిళిసై ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నిర్మల్ జిల్లా బాసర ఆర్జియూకేటీ విద్యార్థి చేసిన ట్వీట్‌పై ఆమె స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల తాను ఆందోళనకు గురవుతున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. తమ తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని గవర్నర్ కోరారు. వర్షంలోనూ తడుస్తూ విద్యార్థులు పోరాటం చేయడం పట్ల ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆర్జీయూకేటీలో సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. మరోవైపు.. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని భైంసా ఏఎస్పీ తెలిపారు. వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. డైరెక్టర్ నియామకం గురించి విద్యార్థులకు చెప్పామని అన్నారు. విద్యార్థులకు ఆహారం, నీళ్లు నిలిపేశామన్న వార్తల్లో వాస్తం లేదని స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులందరికి కూడా ఆహారం, నీళ్లు అందుతున్నాయని చెప్పారు.