రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు, నియంత్రిత సాగు సహా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించింది. ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత సాగు పద్ధతిలో ఈ సారి వానాకాలం పంటలు వేసిన రైతులను కేబినెట్ అభినందించింది. నియంత్రిత పద్ధతిలో సాగు విధానం వ్యవసాయ రంగంలో గొప్ప విప్లవానికి నాంది అని, ప్రభుత్వం తమకోసమే చెప్పిందని రైతులు గ్రహించడం వారి చైతన్యానికి, పరివర్తనా శీలతకు నిదర్శనమని అభిప్రాయపడింది. నియంత్రిత పద్ధతి ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి 13 లక్షల ఎకరాల్లో పంటలు వేసారని, మరో 10 నుంచి12 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని... వీటికి తోడు మరో 8 లక్షల 65 వేల ఎకరాల్లో వివిధ రకాల తోటలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు.
వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది..
గత వానాకాలంలో రాష్ట్రంలో కోటి 22 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే, ఈ సారి కోటి 30 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు జరుగుతోందని వారు వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం, పంటల దిగుబడి పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రివర్గం... తెలంగాణ వ్యవసాయం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని, ఇటీవల భారత ఆహార సంస్థ సేకరించిన ధాన్యంలో రాష్ట్రం వాటా 55 శాతంగా తేలడమే ఈ విషయాన్ని నిరూపించిందని అభిప్రాయపడింది. రైతుబంధు ద్వారా ఈ వానాకాలంలో ఒకేసారి పెద్ద మొత్తంలో రైతులకు నగదు సాయం అందిందని, కరోనా కష్టకాలంలో ఇది రైతులకు బాగా ఉపయోగపడిందని మంత్రులు అన్నారు. కోటి 45 లక్షల ఎకరాలకు సంబంధించి, 57.62 లక్షల మంది రైతులకు, 7,251 కోట్ల రూపాయలు అందించడం అసాధారణమని అన్నారు. ఇంకా ఎక్కడైనా రైతులు మిగిలిపోయి ఉంటే వారిని గుర్తించి సాయం అందించాలని అధికారులను కేబినెట్ కోరింది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ యంత్రాల గణన చేపట్టి ఇంకా ఎన్ని అవసరమో గుర్తించాలని అధికారులను కోరారు.