రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. తెలంగాణాలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని, వచ్చే నాలుగైదు వారాల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ క్రమంలో... నాలుగైదు వారాలపాటు పరిస్థితి క్లిష్టంగా ఉంటుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ గురువారం తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలోనే ఇప్పటి వరకు వెయ్యి మంది కరోనా బారిన పడ్డినట్లు వెల్లడించారు. ఒక ఆరోగ్యశాఖ అధికారి, ఇద్దరు ముగ్గురు పోలీసు అధికారులు కూడా మరణించినట్లు తెలిపారు. ప్రజలు అనవరసరంగా భయాందోళకు గురికావొద్దని.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా మరణాలు 0.88 శాతం మాత్రమే ఉన్నాయని వెల్లడించారు.
సామాజిక బాధ్యతగా అంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు. రాబోయే రోజులు చాలా కఠినంగా ఉండబోతున్నాయని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో పరిస్థితులు ఇంకా సంక్లిష్టంగా మారొచ్చని పేర్కొన్నారు. నగరంలో కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ... ద్వితీయ శ్రేణి నగరాల్లో మాత్రం వైరస్ విస్తరిస్తోందని తెలిపారు. 16 వేల పడకలు ఇంకా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అన్ని రకాల విలువైన మందులను ప్రభుత్వం కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకుందని పేర్కొన్నారు. కేవలం ఒక శాతం మంది మాత్రమే చనిపోతున్నారని వెల్లడించారు.