ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థ చాలా నష్టపోయిందని ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వృత్తి, కళా, వ్యాయామ, ఉపాధ్యాయులు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. ఆ శిబిరాన్ని ఎమ్మెల్సీ రామచంద్రరావు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో అనేక ఖాళీలను భర్తీ చేయని కారణంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఆయన మండిపడ్డారు.
ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని రామచంద్రరావు అన్నారు. వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు వృత్తి, కళా, వ్యాయామ, కంప్యూటర్ రంగాల్లో రాణించే విధంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు.