ఏపీలో మూడోవిడత ఎన్నికల్లో కొన్ని పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు పూర్తయినా.. అధికారులు ఫలితాలను ప్రకటించడం లేదని ఏపీ ఎస్‌ఈసీకి చంద్రబాబు లేఖలో ఫిర్యాదు చేశారు. వైకాపా ఒత్తిళ్ల కారణంగా కావాలనే ఇలా చేస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఫలితాలు విత్ హెల్డ్‌లో పెట్టిన కొన్ని పంచాయతీల వివరాలను ఎస్‌ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. ‘గ్రామ పంచాయతీల ఫలితాలను అక్రమ పద్ధతుల్లో తారుమారు చేయడానికి ప్రయత్నించడం తొలి, మలివిడతతో పాటు ఇప్పుడూ కనిపిస్తోంది’ అని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న వారు, అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
‘రామకుప్పం మండలం పెద్దూరులో రౌడీషీటర్ సత్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నందున అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. పెద్దూరులో ఉంటున్న కాణిపాకం దేవస్థానం ఈవో ఎ.వెంకటేశ్ వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. కుప్పం పట్టణ సీఐ శ్రీధర్ అధికార పార్టీకి మేలు చేకూర్చేందుకు వైకాపాయేతర నాయకులను వేధిస్తున్నారు. వీటన్నింటిపై చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో కోరారు.