"పచ్చబొట్టు చెరిగిపోదులే" అన్నాడు అలనాటి సినీ కవి... "పచ్చబొట్టేసిన.. పిల్లగాడా.." అంటోంది నేటి తరం. పాటేదైనా పలికేది మాత్రం యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాటూ గురించే. పాతతరం వారు సూదులతో పొడిపించుకుంటే.. నేటి తరం మిషన్లతో రాయించుకుంటోంది.
ట్రెండ్‌గా మారిన టాటూస్...
ఒకప్పుడు సన్నిహితుల గుర్తుగా పచ్చబొట్టు వేసుకునేవారు. ఇప్పుడు సినిమాల ప్రభావంతో ట్రెండ్‌గా మారింది. శివమణి, బాహుబలి, వినయ విధేయ రామ సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఎప్పటి నుంచో అనుకరిస్తున్నా.. గత పదేళ్లతో క్రేజ్ బాగా పెరిగింది. అప్పట్లో అమ్మనాన్నల పేరు చేతిమీద వేయించుకునే వారు. ఇప్పుడా స్థానంలోకి ప్రేయసి, ప్రియుల పేర్లు వచ్చేశాయి. వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగానూ కొందరు టాటూలు వేయించుకుంటున్నారు.
విభిన్న రంగుల్లో కూడా...
గతంలో ఆకుపచ్చ రంగులో మాత్రమే టాటూ కనిపించేది. ఇప్పుడు డిజైన్లలోనే కాదు..విభిన్నమైన రంగులూ వచ్చేశాయి. కేవలం ముంజేతికి పరిమితమైన ఈ టాటూ ఇప్పుడు ఒళ్లంతా పాకేసింది. ముఖ్యంగా వీపు, మెడ, నడుం, భుజాలు, చేతివేళ్ల మీద వేయించుకోవడానికి యువత ఆసక్తి చూపుతున్నారు.