తెలంగాణ

telangana

ETV Bharat / state

Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్​ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీం అంగీకారం

హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి.. సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి.. ఈ ఏడాదికే మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. విగ్రహాలను వెంటనే తొలగిస్తామన్న హామీ నేపథ్యంలో అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్​ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు అంగీకారం
Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్​ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు అంగీకారం

By

Published : Sep 17, 2021, 5:27 AM IST

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో ఈ ఒక్కసారికి ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో చేసిన గణేశ్‌ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. కాలుష్యం వెదజల్లకుండా.. విగ్రహాలను నిమజ్జనం చేసిన వెంటనే తొలగిస్తామని జీహెచ్‌ఎంసీ హామీ ఇచ్చిన నేపథ్యంలో అంగీకరిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. ఏటా ఈ సమస్య పునరావృతం కావడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒకవైపు హుస్సేన్‌సాగర్‌ శుద్ధికి ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ, మరోవైపు ఏటా విగ్రహాలను నిమజ్జనం చేసి కలుషితం చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు. కాలుష్యానికి సంబంధించిన ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చిన ప్రతివాది మామిడి వేణుమాధవ్‌ను అభినందించారు.
హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ గణేశ్‌ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధిస్తూ రాష్ట్ర హైకోర్టు ఈ నెల 9న జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. జస్టిస్‌ హిమాకోహ్లి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గతంలో కొన్ని ఉత్తర్వులు జారీ చేసినందున ఆమె ఈ కేసు నుంచి తప్పుకొంటున్నారని.. తాను, జస్టిస్‌ సూర్యకాంత్‌ మాత్రమే వాదనలు వింటామని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కేసు విచారణ ప్రారంభంలో ప్రకటించారు. అనంతరం జీహెచ్‌ఎంసీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా వాదనలు వినిపించారు. ‘‘ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్‌ వైపు కాకుండా.. వేర్వేరు మార్గాల్లో నిమజ్జనం చేయాలని కోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పిన చోట విగ్రహాలను నిమజ్జనం చేసేంత లోతు లేదు. కోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవడానికి సమయం సరిపోనందున ఈ ఏడాదికి మినహాయింపు ఇవ్వాలి. విగ్రహాలను నిమజ్జనం చేసిన మరుక్షణం వాటిని నీటినుంచి తొలగిస్తాం. అక్కడ లాంఛనప్రాయం (సింబాలిక్‌)గా మాత్రమే నిమజ్జనం జరుగుతుంది. ప్రధాన నిమజ్జనం ఈ నెల 18న ప్రారంభమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపు కోరుతున్నాం. వచ్చే ఏడాది నుంచి కోర్టు ఉత్తర్వులను తప్పకుండా అనుసరిస్తాం’’ అని తెలిపారు.

తక్షణం విగ్రహాలను తొలగించడం వల్ల ఎలాంటి కాలుష్యం తలెత్తిందన్నది మీ వాదనా? అని సీజేఐ ప్రశ్నించగా, అవునని తుషార్‌మెహతా బదులిచ్చారు. ప్రతివాది వేణుమాధవ్‌ వాదనల అనంతరం.. ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ‘‘ఇందులో లక్షలాదిమంది ప్రజలు పాల్గొంటారు. వేల నిమజ్జనాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఒక్కసారికి కానివ్వండి. నిమజ్జనం చేసిన వెంటనే విగ్రహాలను తొలగిస్తామని వాళ్లు (జీహెచ్‌ఎంసీ) హామీ ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా అఫిడవిట్‌ దాఖలు చేయమని ఆదేశిస్తాం. మిగిలిన అంశాలపై హైకోర్టును నిర్ణయం తీసుకోనివ్వండి. ఇంతకుమించి మేం దీంట్లో జోక్యం చేసుకోవడంలేదు’’ అని పేర్కొన్నారు. ‘‘ఉత్తర్వుల అమలుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం. సమయానుకూలతను బట్టి హైకోర్టు ఆ అంశాన్ని పరిశీలించి ఉత్తర్వులు జారీచేయొచ్చు’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: Centre on Covid: 'రాబోయే 3 నెలలు జాగ్రత్తగా ఉండండి'

ABOUT THE AUTHOR

...view details