suicides at Hyderabad cable bridge : హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు వాహనాల రాకపోకలు సులువుగా ఉండేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. దాదాపు 184 కోట్ల వ్యయంతో బ్రడ్జి పనులను పూర్తి చేశారు. పర్యాటకులు సందర్శించడానికి వీలుగా తీగల వంతెన నిర్మాణం చేపట్టారు.
హైదరాబాద్ సిగలో మరో మణిహారంగా వెలుగొందుతున్న ఈ బ్రిడ్జి కొంతకాలంగా ఆత్మహత్యలకు అడ్డాగా మారింది. ఈ మధ్య ఇక్కడ ఆత్మహత్యలు ఎక్కువ కావడంతో దుర్గం చెరువు లేక్ వద్ద పోలీస్ స్టేషన్‌ను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. చెరువు చుట్టు సీసీ కెమెరాలను అమర్చి నిరంతరం నిఘా ఉంచుతున్నారు. ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడుతూ గానీ, ప్రమాదశాత్తు గానీ నీటిలో పడితే వారిని కాపాడానికి రెండు పడవలను సిద్దంగా ఉంచారు.
కేబుల్ బ్రిడ్జ్ వద్ద పెరుగుతున్న మరణాలు:ఇటీవల కాలంలో వివిధ కారణాలతో తీగల వంతెన పైనుంచి దూకి దాదాపు ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్కు చెందిన స్వప్న దుర్గం చెరువులో దూకి గత సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె బ్యాగ్‌లో లభించిన లేఖ ఆధారంగా ఆమె చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. మే 6వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో మరో వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని డీఆర్ఎఫ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శౌకత్ తెలిపారు. అతడి కోసం రెండు డీఆర్ఎఫ్ బృందాలు, రెండు పడవల సాయంతో 12 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు.