తెలంగాణ

telangana

ETV Bharat / state

చదువు ఎంఏ ఎంఈడీ.. పంక్చర్‌ దుకాణంలో పని - private schools teachers problems news

మూటలు ఎత్తే కూలీ... బీఎస్‌సీ, బీఈడీ..., సెక్యూరిటీ గార్డు ఎమ్మెస్సీ, బీఈడీ..., పంక్చర్‌ దుకాణంలో పనిచేసే వ్యక్తి ఎంఏ, ఎంఈడీ.. చదివానని చెబితే... ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఏయ్‌ కూలీ అని పిలిస్తే... టెల్‌ మి సర్‌, వాట్‌ షుడ్‌ ఐ డు అని ఆంగ్లంలో అడిగితే కంగుతినాల్సిన పనిలేదు. వారు కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు! ఇప్పుడు ఇలా వేలాది మంది బతుకు పాఠాలు నేర్చుకుంటున్నారు.

study-ma-med-working-in-puncture-shop
చదువు ఎంఏ ఎంఈడీ.. పంక్చర్‌ దుకాణంలో పని

By

Published : Mar 3, 2021, 4:36 AM IST

రోనాతో పాఠశాలలు మూతపడటంతో వారు రోడ్డున పడ్డారు. చేతిలో చిల్లిగవ్వ లేక వారి కుటుంబాలు చితికిపోయాయి. ఏ పని దొరికితే దాన్ని చేస్తూ బతుకుబండిని లాగిస్తున్నారు. ఇలాంటి వారు ఒకరిద్దరు కాదు..వేలల్లో ఉన్నారు.

30 మంది వరకు ఆత్మహత్య


ఉపాధ్యాయ ఉద్యోగాలు పోయి... బతుకుదెరువు లేక ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 మంది ప్రైవేట్‌ ఉపాధ్యాయులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రైవేట్‌ ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. వారికి భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌ ఫోరం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించింది. అనేక ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల వేతనాలు చాలా తక్కువ. పాఠశాలల స్థాయిని బట్టి నెలకు రూ.5 వేల నుంచి రూ.15 వేలు పొందే వారే అధికం. కరోనా మహమ్మారి ఆ జీతాలు కూడా లేకుండా చేయడంతో వారి జీవితాలు అతలాకుతలమయ్యాయి.

కొందరికే కొలువులు


రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులకు, 24 నుంచి 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయినా 20-30 శాతం మందికే ఉద్యోగాలు వచ్చాయని ఆ సంఘాలు చెబుతున్నాయి. 1-5 తరగతులకు ప్రత్యక్ష పాఠాలు లేవు. అంటే సగం మంది ఉపాధ్యాయులకు ఉపాధి లేదు. మిగిలిన తరగతులకు బోధించేవారిని పాఠశాలల యాజమాన్యాలు పూర్తిగా ఉద్యోగాల్లోకి తీసుకోలేదు. ఒక్క వరంగల్‌ నుంచే 200 మంది వరకు కేరళ టీచర్లు సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. అక్కడా కొలువులు దొరకక మళ్లీ కొందరు హైదరాబాద్‌ వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మసాలా పొట్లాలు అమ్ముతూ...


మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దంపతులు కరోనాకు ముందు ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఇద్దరికి కలిపి నెలకు రూ.20 వేల జీతం వచ్చేది. 20 ఏళ్లుగా ఇదే వృత్తి. కరోనా దెబ్బతో ఇద్దరికీ ఉపాధి పోయింది. ఇబ్బందులు ఎక్కువై... మరో దారి లేక.. ద్విచక్రవాహనంపై చుట్టుపక్కల మండలాల్లో తిరుగుతూ కిరాణా దుకాణాలకు మసాలా పొట్లాలు విక్రయిస్తున్నారు. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రారంభంలో భార్య ఒంటిపై నగల్ని తాకట్టు పెట్టారు. చేసేందుకు వ్యవసాయం లేదు. కూలీ పనులకు వెళ్లలేక మసాలాలు అమ్ముతున్నారు.

బరువు బాధ్యత కోసం పనులు

రోజూ దొరికే పనికాదు

సూర్యాపేట జిల్లా తొండతిరుమలగిరికి చెందిన ముత్యాల రమేష్‌ బీఎస్సీ, బీఈడీ పూర్తిచేసి 15 ఏళ్లుగా ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్నారు. కరోనాతో పాఠశాల మూసివేయడంతో పాత ఇనుపకొట్టులో మూటలు ఎత్తే కూలీగా చేరారు. ఇది కూడా రోజూ దొరికే పనికాదు. నెలలో 10 రోజులే. రోజంతా కష్టపడితే రూ.450. గతంలో పనిచేసినప్పుడు టీచర్‌గా.. నెలకు రూ.15 వేలు వచ్చేది. ఏడాదికి దాదాపు రూ.2 లక్షల ఆదాయం. ఇప్పుడు మూటలు మోసి ఏడాదంతా కష్టపడ్డా రూ.50 వేలు వచ్చే అవకాశం లేదని ఆయన చెబుతున్నారు.

వెల్డింగ్‌, పంక్చర్‌ దుకాణంలో పనిచేస్తూ...

చదువు ఎంఏ ఎంఈడీ.. పంక్చర్‌ దుకాణంలో పని

మూన్నూరు యాదగిరి ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఈడీ చదివారు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. కరోనాకు ముందు సూర్యాపేటలో ఓ హైస్కూల్లో పనిచేశారు. లాక్‌డౌన్‌ నుంచి ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో ఓ వెల్డింగ్‌, పంక్చర్‌ దుకాణంలో పనిచేస్తున్నారు. రోజుంతా కష్టపడితే వచ్చే రూ.300-400తో కుటుంబాన్ని పోషిస్తున్నారు.

విద్యార్థుల కుటుంబాలకు సెక్యూరిటీ గార్డుగా...

విద్యార్థుల కుటుంబాలకు సెక్యూరిటీ గార్డుగా...

ప్రైవేటు స్కూల్‌ విద్యార్థుల్లో కొందరి ఇళ్లు నాగోలు సమీపంలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో ఉన్నాయి. ఓ రోజు విద్యార్థులు గేట్‌ వద్ద ఉన్న ఓ వ్యక్తిని చూసి ‘సార్‌.. గుడ్‌మార్నింగ్‌. మీరు ఇక్కడ ఉన్నారేంటి?’ అంటూ ఆశ్చర్యపోయారు. ఆయన అక్కడ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా వంగమర్తికి చెందిన మల్లయ్య 20 ఏళ్లుగా బోధన వృత్తిలో ఉన్నారు. ఎమ్మెస్సీ బీఈడీ చదివారు. ఇంటర్‌ విద్యార్థులకు కొన్నేళ్లు, ఆ తర్వాత ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో 9,10వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. కరోనా దెబ్బకు ఆర్థికంగా కోలుకోలేని స్థితికి వెళ్లారు. ముగ్గురు పిల్లలు. కుటుంబం గడిచేందుకు కొన్నాళ్లు భవన నిర్మాణ కూలీగా పనిచేశారు. ఆ తర్వాత ఓచోట రాత్రి వాచ్‌మన్‌గా చేశారు. ఇప్పుడు సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నారు. తన కష్టాలు ఏకరువు పెడుతుంటే ఆ ఉపాధ్యాయుడితో పాటు పిల్లల కళ్లలోనూ నీళ్లు. ఆ తర్వాత రోజు పలకరిస్తూ ఎప్పట్లానే..మల్లయ్య సార్‌ అంటూ నమస్తే పెడుతున్నారు. వారం నుంచి కన్పించకపోవడంతో ఈ విద్యార్థులు ఆరా తీశారు. మల్లయ్య సార్‌ పిల్లల్లో ఒకరికి ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఓవైపు చికిత్స ఖర్చుకు డబ్బుల్లేక, మరోవైపు ఉన్న సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఉంటుందో, పోతుందో? తెలియక ఆయన తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఇదీ చూడండి :ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తాం: కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details