తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ ధ్రువపత్రాల చెలామణికి అడ్డుకట్ట.. దేశంలోనే తొలిసారిగా..! - Student Academic Verification Service in telangana

నకిలీ ధ్రువపత్రాల చెలామణికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రప్రభుత్వం అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నత చదువు చదవకుండా, ఉద్యోగాలు పొందకుండా చేసింది. తప్పుడు పత్రాలను సులభంగా, వేగంగా గుర్తించేందుకు ఉన్నత విద్యా మండలి ఆన్‌లైన్‌ స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.

నకిలీ ధ్రువపత్రాల చెలామణికి అడ్డుకట్ట.. దేశంలోనే తొలిసారిగా..!
నకిలీ ధ్రువపత్రాల చెలామణికి అడ్డుకట్ట.. దేశంలోనే తొలిసారిగా..!

By

Published : Nov 19, 2022, 10:58 AM IST

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా నకిలీ ధ్రువపత్రాల కేసులు పెరుగుతున్నాయి. తరచుగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ, పోలీస్‌ శాఖ చర్యలు చేపట్టింది. వివిధ విశ్వవిద్యాలయాల తప్పుడు ధ్రువపత్రాల తయారీని నివారించేందుకు ప్రత్యేకంగా స్టూడెంట్ అకాడమిక్‌ వెరిఫికేషన్ సర్వీస్‌ పేరుతో ఓ వెబ్‌పోర్టల్‌ రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలిచ్చే డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఎంబీబీఎస్‌, ఎంబీఏ కోర్సులకు సంబంధించిన ధ్రువపత్రాలను ఒకే పోర్టల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం 2010 నుంచి 2021 వరకు వివిధ కోర్సుల పట్టాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఉంచారు. వెబ్‌సైట్‌ను ప్రతి ఒక్కరూ సులభంగా తెలుసుకునే ఏర్పాట్లు చేశామన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. విద్యాశాఖ ఒక మైలురాయి చేరుకుందని తెలిపారు. త్వరలో పదో తరగతి, ఇంటర్‌ సర్టిఫికెట్లు పోర్టల్‌లో పొందుపరుస్తామని తెలిపారు.

పోర్టల్‌లో ధ్రువపత్రాల సమాచారం తెలుసుకునేందుకు ఎలాంటి ఫీజు ఉండదని.. అభ్యర్థి మార్కులు సహా ఇతర వివరాలు తెలుసుకోవాలంటే రూ.1500 చెల్లించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దేశవిదేశాల్లోని వర్సిటీలు, ఉద్యోగాలిచ్చే సంస్థలు.. ఆ సదుపాయాలను వినియోగించుకోవచ్చని చెప్పారు. గతంలో ఉద్యోగానికి వెళ్లినప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకోవాలంటే చాలా సమయం పట్టేదని.. రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని చెప్పారు.

కొందరు నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం పొందేందుకు యత్నిస్తున్నారని.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఈ పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే నగరంలో చాలాచోట్ల నకిలీ సర్టిఫికెట్ ముఠాలను అరెస్టు చేశామన్న ఆయన.. అలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. "స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్" పోర్టల్‌ను మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details