తెలంగాణ

telangana

ETV Bharat / state

పులిపోస...ఇదంటే మన్యం ప్రజల గుండెల్లో హడల్ !

పచ్చని అడవి అందాలు, హిమపాతాలు, సెలయేళ్లు, వాగులు, వంకలు, రకరకాల జీవ జాతులు...అడవితల్లినే నమ్ముకుని జీవించే గిరిజన కుటుంబాలు ఇలాంటి  ఎన్నో విశేషాల సముహామే విశాఖ మన్యం. అలాంటి  మన్యంలో ఓ విష జీవి గిరిజన వాసులను భయపెడుతోంది. ఆ జీవి పేరు వింటేనే అమ్మో అనే పరిస్థితి ఉంది. మరీ ఆ ప్రాణాంతకమైన జీవి విశేషాలేంటో చూద్దాం!

By

Published : Oct 26, 2019, 6:58 PM IST

గుండెల్లో హడల్ !

పులిపోస...ఇదంటే మన్యం ప్రజల గుండెల్లో హడల్ !
విశాఖ మన్యం ఓ కొండ కోనల సమూహం. కోట్లాది జీవరాసుల ఆవాసం. అలాంటి జీవరాసుల్లో ఒకటి పులిపోస. నలుపు రంగు ఆకృతిలో తెలుపు చారలు కలిగి ఉండే బల్లి లాంటి జీవి. ఇది చాలా ప్రమాదకరమైనది. పొరపాటున కరిస్తే అంతే...పది నిమిషాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పాడేరు మండలం ఇనాడ, దేవాపురం పంచాయతీల పరిధి కొండ చరియల్లో ఈ జీవులు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

పులిపోసే కాదు పులిబల్లిగా కూడా..
మన్యంలో ఉండే గిరిజనులు ఈ విష జీవిని 'పులిపోస'గా పిలుస్తారు. శరీరంపై పులిచారలు కలిగి ఉండటంతో దీనిని 'పులిబల్లి' అని కూడా అంటారు. ఇవి కొండ తొర్రల్లో నివసిస్తాయి. వర్షాలు, తేమ ఉన్న సందర్భాల్లో రాత్రి వేళ్లలో ఎక్కువగా బయటకు వస్తాయి. కొండ గట్ల వద్ద తిరిగే గిరిజనులు వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.


నిమిషాల్లోనే అనంతలోకాలకు!
ఈ పులిబల్లి కరిస్తే కేవలం పది నిమిషాల్లోనే హఠాత్తుగా చనిపోతారు. కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేసే సమయం కూడా ఉండదు. ఏమి జరిగిందో అని తెలుసుకునే లోపే ప్రాణాలు అనంతలోకాలకు చేరిపోతాయి. ఈ పులిపోసలతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్థానిక గిరిజనులు హెచ్చరిస్తున్నారు.

మన్యంలో ఇలాంటి విష జీవుల బారిన పడి ఎంతో మంది ఆకస్మిక మరణాలకు గురవుతుంటారు. ఇలాంటి జీవుల గురించి గిరిజనుల్లో అవగాహన కల్పించి...విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చదవండి :విశాఖలో తీగ లాగితే... కోల్​కతాలో డొంక కదిలింది!

ABOUT THE AUTHOR

...view details