నిలిచిన చెరువుల సుందరీకరణ... - hyderabad
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులను గుత్తేదారులు అర్ధంతరంగా నిలిపి వేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ కాకతీయలో భాగంగా చేపడుతున్న చెరువుల సుందరీకరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లి ప్రాంతంలో సుమారు 14 చెరువులను సుందరీకరణ కోసం ఎంపిక చేశారు. జాప్యం కారణంగా పనులు పూర్తి కాకపోవడంతో, ఈ వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది. చెరువులు అన్నింటిలోనూ నీటిని దిగువకు వదిలేసి, పూడికతీత పనులు ప్రారంభించారు. వాటిని అర్ధంతరంగా వదిలేయడం వల్ల వర్షం పడితే అవి మళ్లీ యథాస్థితికి వచ్చే ప్రమాదం లేకపోలేదు. మియాపూర్ పటేల్ చెరువు, చందానగర్ గంగారం చెరువులలో పనులు ప్రారంభించినప్పటికీ, అవి పూర్తి కాకపోవడంతో వర్షపు నీటితో ఆ చెరువులు యథాస్థితికి రానున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వర్షాలతో చెరువులు నిండకముందే పూడిక తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.