Bathukamma Celebrations in Telangana 2022: రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలకు రంగం సిద్ధమయ్యింది. ఈ నెల 25 నుంచి అక్టోబరు 3 వరకు జరగనున్న వేడుకలను.. మరోసారి లోకానికి చాటి చెప్పేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో బతుకమ్మ పండుగ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
ఉద్యమ సమయంలో మహిళలు, ఉద్యోగులు, సకల జనులను ఏకీకృతం చేయడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషించడాన్ని గుర్తు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో మరోసారి గ్రామాలతో పాటు హైదరాబాద్‌లోనూ అత్యంత వైభవంగా నిర్వహించాలని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో లాల్ బహుదూర్ స్టేడియంలో సద్దుల బతుకమ్మ ముగింపు వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
వెయ్యిమందికిపైగా జానపద, గిరిజన కళాకారుల మధ్య వేలాదిమంది మహిళలు బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రవీంద్రభారతిలో వివిధ సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు జరపాలని పేర్కొన్నారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ సారథ్యంలో 26, 27, 28 తేదీల్లో "దేవీ వైభబ్" పేరిట శాస్త్రీయ నృత్యాలు ప్రదర్శిస్తారన్నారు. సాహిత్య అకాడమీ తరఫున మహిళా రచయితలు, కవులు బతుకమ్మ విశిష్టతను చాటిచెప్పేలా పుస్తకం ప్రచురించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు.