తెలంగాణ

telangana

ETV Bharat / state

రహదారుల విస్తరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం - telangana varthalu

అభివృద్ధికి బాటలు వేసి వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చేది రహదారి వ్యవస్థ. ఇది ఎంత పటిష్ఠంగా ఉంటే...ఆర్థిక వ్యవస్థ అంత బలోపేతమవుతుంది. రహదారులు అభివృద్ధి చెందిన చోట.. పురోగతి వేగంగా కనిపిస్తుంది. అందుకే ప్రభుత్వాలు రహదారుల నిర్మాణానికి అంతగా ప్రాధాన్యతనిస్తాయి. తెలంగాణ ప్రభుత్వమూ ఈ విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ ఏ స్థాయిలో ఉంది..? ప్రధాన లైన్లు ఏవి...? అవి ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వాటి కారణంగా జరిగిన అభివృద్ధి ఏంటి..?

రహదారుల విస్తరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
రహదారుల విస్తరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

By

Published : Mar 25, 2021, 2:25 AM IST

రహదారుల విస్తరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే.. ఆ ప్రాంతంలో రహదారులు విస్తరణ జరగాలి. వాటితోనే మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఆ రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. తెలంగాణలో 31వేల345 కిలోమీటర్ల పరిధిలో రహదారులు విస్తరించి ఉన్నాయి. వీటిలో 23 జాతీయ ర‌హ‌దారులు 3,824 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిలో 1,551 కిలోమీటర్ల రోడ్లు, రాష్ట్ర రహదారులు, భ‌వ‌నాల శాఖ పరిధిలోవి కాగా మిగిలిన 2,273 కిలోమీటర్లు భార‌త జాతీయ ర‌హ‌దారుల సంస్థ పరిధిలోకి వ‌స్తాయి. రాష్ట్రంలో 2,500కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు, మేజర్ జిల్లాల రోడ్లు 12,071 కిలోమీటర్ల వరకు, ఇతర జిల్లాల రోడ్లు 13,301 కిలోమీటర్ల వేర విస్తరించి ఉన్నాయి. వీటితో పాటు పంచాయతీ రాజ్ రోడ్లు 50వేల కిలోమీటర్లు వరకు ఉన్నాయి.

సాఫీగా ప్రయాణించాలంటే..

రహదారుల విస్తరణతో రోడ్డు మార్గంలో వ్యవసాయ, పారిశ్రామిక ముడి సరుకులు, ఔషధ రంగాలతో పాటు పెట్రో ఉత్పత్తులు, కూరగాయల ఎగుమతులు, దిగుమతులకు వెసులుబాటు కలుగుతుంది. ప్రజలు సాఫీగా ఇతర ప్రాంతాలకు ప్రయాణించగలుగుతారు. పర్యాటకంగానూ అభివృద్ధి చెందేందుకు ఆస్కారముంటుంది. రహదారుల నిర్మాణంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే మెరుగైన రహదారి వ్యవస్థతోనే సాధ్యమవుతుందని రవాణా రంగ నిపుణులు అభిప్రాయడుతున్నారు. హైదరాబాద్ చుట్టూ వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయంటే అందుకు ప్రధాన కారణం మెరుగైన రవాణా వ్యవస్థే.

పలు రహదారులతో అనుసంధానం

రాష్ట్ర రాజధాని చుట్టూ ఇప్పటికే బాహ్య వలయ రహదారి నిర్మాణం చేశారు. ఇటీవల ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 25 చిన్న, పెద్ద పట్టణాలు, 300 వరకు గ్రామాలను ఇది అనుసంధానిస్తుందని అంచనా. ప్రాంతీయ వలయ రహదారి.. 8 జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం కానుందని తెలుస్తోంది. ఎన్‌హెచ్‌–65, ఎన్‌హెచ్‌–161, ఎన్‌హెచ్‌–44, ఎన్‌హెచ్‌–765, ఎన్‌హెచ్‌–765డి, ఎన్‌హెచ్‌–163, రాజీవ్‌ రహదారి, నాగార్జున సాగర్‌ రహదారులను అనుసంధానిస్తుంది. ఒక రోడ్డు నుంచి మరో రోడ్డులోకి మారేందుకు నగరంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే రీజినల్‌ రింగు రోడ్డు మీదుగా మళ్లొచ్చు. ఫలితంగా నగరంపై ట్రాఫిక్‌ భారం తగ్గుతుంది. రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల అవతల 348 కిలోమీటర్ల ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణానికి...భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 750 కోట్ల రూపాయలు కేటాయించింది.

రహదారుల మరమ్మతులకు నిధులు

రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు 1,100 కోట్లు, 21 నూతన ఆర్వోబీ, ఆర్‌యూబీల నిర్మాణానికి 400 కోట్లు కేటాయించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ను జాతీయ రహదారుల కింద చేపట్టాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం.. భూసేకరణలో 50 శాతాన్ని భరించనున్నట్టు తెలిపింది. ఈ నిధులతో ఉత్తర భాగంలో భూసేకరణను వేగంగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని రహదారులు, భవనాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణలో రోడ్‌ నెట్‌వర్క్‌ బాగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 5,800 కిలోమీటర్ల రహదారులను కొత్తగా నిర్మించారు. రోడ్లు భవనాలశాఖ 360 కిలోమీటర్ల నాలుగు లేన్లు, 7,630 కిలోమీటర్ల డబుల్‌ లేన్‌ రోడ్ల నిర్మాణం చేపట్టింది. వీటితోపాటు 386 వంతెనలను నిర్మించారు. రోడ్లు భవనాలశాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో 8,788 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది ప్రభుత్వం. ఇందులో గజ్వేల్‌ సహా ఇతర కనెక్టివిటీ రోడ్లకు 90 కోట్ల రూపాయలు కేటాయించింది.

రోడ్లను కాపాడుకోవడం ముఖ్యమే..

రహదారులను నిర్మించడమే కాదు.. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే. రోడ్లు మరమ్మతులకు గురైతే.. వాటి వల్ల ప్రమాదాలు జరగడంతో పాటు మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే జాతీయ రహదారులపై ప్రమాదకర స్థలాలను గుర్తించిన ఎన్.హెచ్.ఏ.ఐ సంస్థ వాటికి మరమ్మతులు చేస్తోంది. అందులో భాగంగా ఇటీవల భారతీయ రోడ్ కాంగ్రెస్ నియమ నిబంధనల ప్రకారం...2015-18 వరకు జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాద ప్రాంతాలను గుర్తించింది. ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అవి జరగకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వాహనదారులను అప్రమత్తం చేయడం, వాహనాల వేగాన్ని నియంత్రించటం, రహదారుల్లో బ్లాక్ స్పాట్ ఉందని సూచించే విధంగా సైన్ బోర్డులు, రోడ్ మార్కింగ్, ఎల్లో గ్రిడ్ మార్కింగ్, రింబల్ స్ట్రిప్స్, సోలార్ బ్లింకర్స్, పవర్ బ్లింకర్స్, యూటర్న్ సూచికలు, వేగ నియంత్రణ బోర్డుల వంటివి ఎన్​హెచ్​ఏఐ ఏర్పాటు చేసింది.

ప్రమాదాలు జరగకుండా..

జాతీయ రహదారుల పరిధిలో ఉన్న 183 బ్లాక్ స్పాట్‌లను గుర్తించడంతో పాటు..ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా పలు నివారణ చర్యలు చేపడుతోంది..ఎన్​హెచ్​ఏఐ. ఎన్‌హెచ్-65 పరిధిలో అత్యధికంగా 46 ప్రాంతాలు, ఎన్​హెచ్​-163లో 29 ప్రాంతాలు, హైదరాబాద్ -బెంగుళూరు రహదారిలో 18 ప్రాంతాలను, ఎన్​హెచ్​-363లో 19 ప్రాంతాలను జాతీయ రహదారుల శాఖ గుర్తించింది. వీటిలో తక్కువ సమయంలో పూర్తి చేసే పనులు, ఎక్కువ సమయంలో పూర్తి చేయదగిన పనులు అని రెండు రకాలుగా విభజించి పనులను చేపట్టింది. తక్కువ సమయంలో పూర్తి చేసే109 పనులకు 38.53 కోట్లతో పనులు చేపడుతోంది. ఎక్కువ సమయంలో పూర్తి చేసే 8 పనులకు 144.02 కోట్లతో పనులు ప్రారంభించింది. మొత్తం 117 పనులకు గాను 182.54 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎన్​హెచ్​ఏఐ చేపట్టిన పనుల్లో దాదాపు 80% రహదారుల్లో పనులు పూర్తయ్యాయని...మిగిలిన వాటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయి..

సరిచేసిన బ్లాక్ స్పాట్‌లలో సత్ఫలితాలు వస్తున్నాయని... ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రహదారుల మరమ్మతులు చేయడం వల్ల ప్రమాదాల నివారణ సాధ్యమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్-ముంబయి-మచిలీపట్నం రహదారి, బెంగళూరు-హైదరాబాద్-నాగ్ పూర్ రహదారి, మద్రాస్-కలకత్తా వెళ్లే రహదారి మాత్రమే మెరుగైన రహదారులుగా ఉన్నాయని రవాణారంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ప్రమాదకరమైన మలుపులు, జంక్షన్లు ఉండడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ రహదారుల స్థాయిని పెంచితేనే జాతి సంపద పెరుగుతుంది. అంతర్రాష్ట్ర సరుకు రవాణా, ప్రయాణాలు పెరుగుతాయని తద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

2016-18 వరకు మూడేళ్లలో ఒకే ప్రాంతంలో పలుమార్లు జరిగిన ప్రమాదాల వివరాలు :

  • ఎన్.హెచ్-44 రహదారిలో పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి దర్గా వద్ద 62 ప్రమాదాలు జరిగితే..9 మంది మరణించారు.
  • ఎన్.హెచ్-44 రహదారిలో కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో భిక్నూర్ గ్రామ శివారులో 34 ప్రమాదాలు జరిగితే..8 మంది మరణించారు.
  • ఎన్.హెచ్ -163 రహదారిలో వరంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెయ్యి స్థంబాల గుడి -ములుగు రోడ్ లో 27 ప్రమాదాలు జరిగితే..నలుగురు మరణించారు.
  • ఎన్.హెచ్-163 రహదారిలో వరంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెంబర్తి ఆర్చ్ నుంచి పెంబర్తి వరకు ఉన్న రోడ్ లో 24 ప్రమాదాలు జరిగితే...7 మంది మరణించారు.

గడిచిన నాలుగేళ్లలో జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాలు, వాటివల్ల మరణించిన వారు :

  • 2016లో 818 ప్రమాదాలు జరిగితే 369 మంది మరణించారు.
  • 2017లో 647 ప్రమాదాలు జరిగితే 294 మంది మరణించారు.
  • 2018లో 759 ప్రమాదాలు జరిగితే 334 మంది మరణించారు.
  • 2019లో 321 ప్రమాదాలు జరిగితే 95 మంది మరణించారు.
  • 2020 సెప్టెంబర్ వరకు 205 ప్రమాదాలు జరిగితే 52 మంది మరణించారు.

ఇదీ చదవండి: కొత్త రైల్వే లైన్ నిర్మించే ఉద్దేశమేమీలేదు: పీయూశ్​ గోయల్

ABOUT THE AUTHOR

...view details