Women Commission Notices to Bandi Sanjay : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాష్ట్ర మహిళా కమిషన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు జారీచేసింది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి... ఈ కేసును సుమోటోగా విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని డీజీపీని గతంలోనే కమిషన్ ఆదేశించింది. అయితే తాజాగా బండికి వ్యక్తిగతంగా మహిళా కమిషన్ నోటీసులు పంపింది.
ఎమ్మెల్సీ కవితపై సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మహిళా కమిషన్... ఈ నెల 15న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మద్యం కేసులో కవితకు ఈడీ నోటీసుల సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన బీఆర్ఎస్ శ్రేణులు... వివిధ పోలీస్ స్టేషన్లలో ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు.
బహిరంగ క్షమాపణ చెప్పాలి : ఇదిలా ఉంటే కవిత ఈడీ విచారణకు హాజరైన రోజు బండి సంజయ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి... ప్రధాని మోదీ, బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని.. వెంటనే కవితకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
బండి వ్యాఖ్యలు సమర్థించనన్న ఎంపీ అర్వింద్ : ఇదే అంశంపై నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తాను సమర్థించబోనని పేర్కొన్నారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే మంచిదని అర్వింద్ హితవు పలికారు. బండి వ్యాఖ్యలు బీఆర్ఎస్కు ఒక ఆయుధంగా మారాయని వ్యాఖ్యానించారు. సామెతలను ఉపయోగించే ముందు జాగ్రత్తగా వాడాలని సూచించారు. ఆయన వ్యాఖ్యలతో బీజేపీకి ఏం సంబంధం లేదన్నారు. ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు బండి సంజయే సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే హోదా.. పవర్ సెంటర్ కాదని అర్వింద్ ధ్వజమెత్తారు. అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యతతో మెలిగే పదవి అని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి: