ఈసారి రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.1.67 లక్షల కోట్ల నుంచి రూ.1.70 లక్షల కోట్ల మధ్య ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర రాబడులు అంచనాల కంటే తగ్గిన నేపథ్యంలో బడ్జెట్ పరిమాణం ఓట్ ఆన్ అకౌంట్ కంటే 8 నుంచి 10 శాతం తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఓట్ ఆన్ బడ్జెట్ను రూ.1.82 లక్షల కోట్లతో ఆమోదించారు. అయితే మాంద్య పరిస్థితుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావించిన సీఎం కేసీఆర్ దానికి అనుగుణంగా ప్రస్తుత పద్దుకు తుదిరూపు ఇచ్చారు.
వ్యవ'సాయ' రంగాలకు ప్రాధాన్యం
వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాలకు ఈసారి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల్లో కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ వీటికి కేటాయింపులు తగ్గించకుండా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెరాస ఎన్నికల హామీలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు బడ్జెట్లో పెద్దపీట వేయనున్నారు.