తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపటి నుంచే ఇంటర్​ జవాబుపత్రాల మూల్యాంకనం

పదో తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనానికి విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. మూల్యాంకన ప్రక్రియ రేపటి నుంచే చేపట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. పదో తరగతి పరీక్ష అనుమతి కోసం రేపు లేదా ఎల్లుండి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. పదోతరగతి పరీక్ష కేంద్రాలను రెండింతలు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. రేపు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి.. తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.

By

Published : May 6, 2020, 9:43 PM IST

ssc exams, intermediate valuation arrangements in telangana
రేపటి నుంచే ఇంటర్​ జవాబుపత్రాల మూల్యాంకనం.. బోర్డు నిర్ణయం

పదో తరగతి పరీక్షలు, ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ వెంటనే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడం వల్ల ఆ దిశగా విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు పూర్తయినప్పటికీ.. మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ముందుగా రెండో సంవత్సరం.. ఆ తర్వాత మొదటి సంవత్సరం సమాధాన పత్రాల మూల్యాంకనం చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మూల్యాంకన ప్రక్రియలో భాగంగా రేపటి నుంచి జవాబు పత్రాల కోడింగ్ నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈనెల 11 లేదా 12 నుంచి మూల్యాంకనం చేసేందుకు కసరత్తు చేస్తోంది. అధ్యాపకులు భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున.. ప్రస్తుత 12 మూల్యాంకన కేంద్రాలను 33కి పెంచాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

మూల్యాంకనం నెలరోజుల్లో పూర్తి చేసేలా చర్యలు

సుమారు 55 లక్షల జవాబు పత్రాల.. మూల్యాంకన ప్రక్రియలో సుమారు 15వేల మంది సిబ్బంది పాల్గొననున్నందున... కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఉద్యోగికి మూడు మాస్కులు, వ్యక్తిగత శానిటైజర్లు, పోలీసు పాస్​లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూల్యాంకన కేంద్రాల్లో క్యాంటీన్ సదుపాయం.. అవసరమైన సిబ్బందికి రవాణా, వసతి సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు.మూల్యాంకన కేంద్రాల్లో రోజూ శానిటైజేషన్, ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేసి.. జూన్ రెండో వారంలో ఫలితాలను ప్రకటించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.

పదోతరగతి పరీక్షలపై కసరత్తు

లాక్​డౌన్ సమయంలోనే పదో తరగతి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడం వల్ల విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. రెండు సబ్జెక్టులకు సంబంధించి మూడు పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా నాలుగు సబ్జెక్టులకు చెందిన ఎనిమిది పరీక్షలు జరగాల్సి ఉంది. పదో తరగతి పరీక్షలు నిలిపివేయాలని హైకోర్టు గతంలో ఆదేశించడం వల్ల అర్థాంతరంగా ఆగిపోయాయి. పదో తరగతి పరీక్షల నిర్వహణకు అనుమతి కోరుతూ రేపు లేదా ఎల్లుండి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. గతంలో హైకోర్టు పేర్కొన్న అభ్యంతరాలు, అనుమానాలు నివృత్తి చేస్తూ.. కరోనా నివారణ చర్యలు ఏ విధంగా తీసుకుంటారో వివరిస్తూ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. హైకోర్టు అనుమతిస్తే.. వారం లేదా పది రోజులు విద్యార్థులకు గడువు ఇచ్చి.. పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు వీలుగా.. పరీక్ష కేంద్రాలను దాదాపు రెట్టింపు చేయాలని నిర్ణయించారు. అదనపు పరీక్షలు కేంద్రాలను సిద్ధం చేయాలని డీఈఓలను ఉన్నతాధికారులు ఆదేశించారు. విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు, పాస్​లు ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.

రేపే తుది నిర్ణయం

పదో తరగతి పరీక్షలు, ఇంటర్ మూల్యాంకనం ఏర్పాట్లపై విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇవాళ డీఈఓలు, డీఐఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రేపు ఉదయం పదకొండున్నర గంటలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి.. తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లో అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details