శ్రీ మహా విష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. ఈ రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు. శ్రీరామ జననం, సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం. మన సనాతన ధర్మం, పురాణాలు, జ్యోతిషశాస్త్రం ప్రకారం మహా విష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది.
ఉదాహరణకు.. నారసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది. కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది. వామన అవతారం గురుగ్రహం; అలాగే, శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడిని సూచిస్తుంది. రామాయణం, జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శ్రీరాముడు త్రేతాయుగంలోని గురువారం రోజున చైత్ర శుక్ల నవమినందు కర్కాటక లగ్నంలో జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.
శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించడం.. ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్ఛక్షేత్రంలో ఉండటం.. ఇవన్నీ ధర్మస్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా ఉండాలనే అంశాలు రామాయణం ద్వారా తెలుసుకుంటారు. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన, ఉత్తమ రాజు లక్షణం, ఉత్తమ సోదరుడి కర్తవ్యం.. ఇలా అనేక విషయాలన్నీ రామ అవతారంలో చూసి నేర్చుకోవాల్సిన గొప్ప సుగుణాలు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీరాముడిని సనాతన ధర్మంలో పూజించడం వల్ల విజయాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
మాసములలో మొదటి మాసం చైత్ర మాసం, సనాతన ధర్మంలో సంవత్సరంలో తొలి పండుగ, తొలి పూజ చైత్ర శుక్ల నవమి రోజు చేసే శ్రీరామ పూజ/వ్రతం.
శ్రీరామనవమి రోజున ఏం చేయాలి?
శ్రీరామ నవమి రోజున ప్రతిఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానమాచరించాలి. ఇంటిని తోరణాలతో అలంకరించాలి. కొత్త వస్త్రాలు ధరించాలి. ఇంట్లో, కుదరనిపక్షంలో దేవాలయాల్లో శ్రీరాముడు, సీతాదేవి,హనుమంతుడు, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్టచేయాలి. ధ్యాన ఆవాహనాధి షోడశోపచారాలతో శ్రీరామచంద్రుడిని పూజించాలి. ఈ పూజలో శ్రీ సీతారాముడిని అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. ఇలా పూజించి రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. ఈ రోజు ఉపవాసం/ జాగరణ చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తికలుగుతుంది. శ్రీరామనవమి రోజున రామనామస్మరణం చేయడం, రామకోటి వంటివి రాయడంవల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయి.
శ్రీరామనవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామవ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల వాక్కు. ఈరోజు రామనామస్మరణ చేయడం, రామనామ ధ్యానం చేయడం వల్ల పాపాలు తొలగి, జయాలు సిద్ధిస్తాయి.