రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ ఉద్యాన రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.నీరజ ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ వీసీగా నియమితులైన తర్వాత ఆమె తొలిసారిగా గవర్నర్‌ను కలవగా శుభాకాంక్షలు తెలియజేశారు.
స్నాతకోత్సవానికి అనుమతి...
యూనివర్సిటీలో సాగుతోన్న విద్యా బోధన, పరిశోధన, విస్తరణ పురోగతిపై గవర్నర్‌కు వీసీ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల నేపథ్యంలో అన్ని కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఫిబ్రవరి 1 నుంచి కళాశాలు తిరిగి తెరవడానికి విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉందని చెప్పారు. మార్చి నెలలో వర్చువల్ వేదికగా శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహిండానికి గవర్నర్ అనుమతి తీసుకున్నారు.