Spouse Teachers Protest at Dharna chowk : హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతులు ఆందోళన నిర్వహించారు. ఉపాధ్యాయ దంపతుల బదిలీలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆవేదన సభ నిర్వహించారు. పలువురు మహిళా ఉపాధ్యాయులు బోనాలతో ర్యాలీ తీసి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ శిబిరాన్ని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, టీపీటీఎఫ్, ఆపస్, ఎస్టీయూ తదితర సంఘాల ప్రతినిధులు హాజరై స్పౌజ్ టీచర్ల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.
317 జీవో ఆశాస్త్రీయమైందని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని టీచర్ల సమస్యలపై.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అందరినీ ఒకే వేదికపై తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. గత 18 నెలలుగా మహిళా ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భర్త ఒక జిల్లాలో, భార్య మరొక జిల్లాలో విధులు నిర్వహించడం దుర్భరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి టీచర్ల సమస్యపై దృష్టిసారించి తక్షణమే పరిష్కరించాలని విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానాల ఫలితంగా భార్యాభర్తలు వేరువేరు చోట్ల పనిచేయాల్సిన పరిస్థతి ఏర్పడిందని.. పరోక్షంగా ప్రభుత్వమే దంపతులను విడదీస్తోందని మహిళా ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేశారు.