Super Specialty Hospitals Corporation: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఆసుపత్రుల నిర్మాణానికి అవసరమైన నిధులను బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.కోటి మూలధనంతో ‘తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్‌ఎస్‌హెచ్‌సీఎల్)’ పేరిట దీనిని ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా ఉత్తర్వులు విడుదల చేశారు.
సమవాటాగా..
వరంగల్‌లో నిర్మించనున్న అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, అన్ని జిల్లాల్లోనూ కొత్తగా నెలకొల్పనున్న వైద్య కళాశాలలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చుకోవడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక సంస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.కోటి మూలధనాన్ని ఒక్కో వాటా(షేర్) విలువ రూ.10 చొప్పున.. 10 లక్షల షేర్లను సమవాటాగా విభజించారు.
ప్రాథమిక ఆరోగ్యం మొదలుకొని బోధనాసుపత్రుల దాకా...
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యంలో ప్రాథమిక ఆరోగ్యం మొదలుకొని బోధనాసుపత్రుల దాకా.. అన్ని స్థాయుల్లోనూ నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనకు వైద్య ఆరోగ్యశాఖలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అందుబాటులో ఉంది. ఈ సంస్థ ద్వారా రుణాలు పొందడానికి సాంకేతికంగా అడ్డంకులు ఎదురవడంతో కొత్త సంస్థను నెలకొల్పడం అనివార్యమైందని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రుణాలు పొందడం అవశ్యమని, అందుకు కొత్త సంస్థ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ వైద్య విద్య సంచాలకులు ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు.