తెలంగాణ

telangana

ETV Bharat / state

transgender: మార్పు కోసం.. హిజ్రాలకు సైబరాబాద్‌ పోలీసుల ప్రత్యేక శిక్షణ

హిజ్రాలంటే(transgender) సమాజంలో చిన్న చూపు. ఏహ్యభావంతో చూస్తుంటారు. పనిలో పెట్టుకోవడానికీ ఎవరూ ముందుకురారు. దీంతో ఉపాధి అవకాశాలు లేక హిజ్రాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. కానీ సైబరాబాద్ పోలీసులు ట్రాన్స్ జెండర్లకు అండగా నిలుస్తున్నారు. కమిషనరేట్‌లో ఓ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి... శిక్షణ ఇచ్చి ఏదైనా ఉపాధి పొందేలా వారిని తీర్చిదిద్దుతున్నారు.

transgenders help desk, cyberabad police help
హిజ్రాలకు పోలీసుల సాయం, ట్రాన్స్‌జెండర్ల కోసం సైబరాబాద్ పోలీసుల ప్రత్యేక శిక్షణ

By

Published : Aug 10, 2021, 4:01 PM IST

Updated : Aug 11, 2021, 10:41 AM IST

సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటారు. కరోనా కాలంలో వలస కార్మికులకు అండగా నిలిచారు. రోజు ఓ పూట భోజనం పెట్టడంతో పాటు... నిత్యావసర సరకులు అందించారు. రక్తనిధి కేంద్రాల్లో రక్తం కొరత ఏర్పడటంతో సీపీ సజ్జనార్ ప్రత్యేక చొరవ తీసుకొని రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఐసోలేషన్‌ కేంద్రాలు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచారు. ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సైబరాబాద్ పోలీసులు... నిరాదరణకు గరవుతున్న హిజ్రాలకూ(transgender) అండగా నిలుస్తున్నారు. వారికి ఉపాధి కల్పించడంతో పాటు... వారిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు.

గచ్చిబౌలి ఠాణాలో ఈ ఏడాది మార్చి 6న హెల్ప్‌డెస్క్‌ ప్రారంభించారు. ఎస్సై, ఏఎస్సైతో పాటు మహిళా కానిస్టేబుల్‌ను హెల్ప్ డెస్క్ పర్యవేక్షకులుగా నియమించారు. హిజ్రాలను సమన్వయం చేయడానికి వాళ్ల కమ్యూనిటీ నుంచే ఓ హిజ్రాను సమన్వయకర్తగా నియమించారు. ప్రస్తుతం హిజ్రాలకు వాళ్ల ప్రతిభ ఆధారంగా శిక్షణ ఇచ్చి.. కంపెనీల్లో ఉద్యోగం వచ్చేలా సైబరాబాద్ పోలీసులు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన హిజ్రాలైనా వారికి శిక్షణ అందిస్తున్నారు. హిజ్రా సంఘాలతో కలిసి సీపీ సజ్జనార్ సమావేశాలు నిర్వహించి... హెల్ప్‌డెస్క్‌ గురించి అవగాహన కల్పిస్తున్నారు. సైబరాబాద్‌ పరిధిలో ఐటీ, నిర్మాణ రంగాలకు ఎలాంటి నైపుణ్యాలు ఉన్న వ్యక్తులు కావాలో... అదే స్థాయిలో హిజ్రాలకు కేఐపీడీ(KIPD) సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. అలా శిక్షణ తీసుకున్న 10 మంది హిజ్రాలకు ఉద్యోగం ఇప్పించారు. స్వయం ఉపాది అవకాశాలూ కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

హిజ్రాలకు సైబరాబాద్‌ పోలీసుల ప్రత్యేక శిక్షణ

'ఉద్యోగం చేయడానికి కావాల్సిన నైపుణ్యాలు నేర్పించడం కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ వర్క్ షాప్ ఒక ముందడుగు మాత్రమే. ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో చాలామందికి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తాం. హిజ్రాల్లో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలామందిలో మార్పు వచ్చింది. ఇంకా కొందరు ఉన్నారు. ఇప్పటిదాకా ఎలా ఉన్నా.. ఇక నుంచి మారాలి. వారికి మేం సహకరిస్తాం.'

-సజ్జనార్, సైబరాబాద్ సీపీ

సైబరాబాద్‌ పోలీసులు నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాల వల్ల తామూ అభివృద్ధి చెందుతామని పలువురు హిజ్రాలు అభిప్రాయపడుతున్నారు. సమాజంలో సగర్వంగా బతుకుతామని చెబుతున్నారు.

'ఈ హెల్ప్ డెస్క్‌తో ట్రాన్స్‌జెండర్లలో చాలా మార్పు వచ్చింది. పాతవిధానానికి ఇప్పటికీ మార్పు ఉంది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం. ఈ ఫ్లాట్‌ఫాం ద్వారా హిజ్రాల్లోని ప్రతిభ బయటకు వచ్చింది. ట్రాన్స్‌జెండర్లు కూడా ఆత్మగౌరవంతో బతకాలనేదే మా కోరిక. కొన్నాళ్ల క్రితం హిజ్రాలకు ఉద్యోగం అంటే సమాజంలో పెద్దగా అంగీకరించలేదు. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా ఉద్యోగం చేసుకునే అవకాశం దక్కింది. మున్ముందు ట్రాన్స్‌జెండర్లకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆశిస్తున్నాం.'

- శిక్షణ పొందుతున్న ట్రాన్స్‌జెండర్లు

హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మొత్తం 8వేల మంది హిజ్రాలున్నట్లు హెల్ప్ డెస్క్ గుర్తించింది. వీళ్లలో ప్రతిభ ఉన్న వాళ్లకు ఉద్యోగం కల్పించడంతో పాటు.... మిగతా వాళ్లకు స్వయం ఉపాధి అవకాశాలు లభించేలా కృషి చేస్తున్నారు.

ఇదీ చదవండి:VIVEKA MURDER CASE: 'పెద్ద తలలు తప్పించుకునేందుకే పన్నాగం!'

Last Updated : Aug 11, 2021, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details