కళకారులుగా రాణించాలంటే ఇష్టం ఉంటే సరిపోదు.. దానికి తగిన శ్రమ కూడా ఉండాలి. ఒక వేళ అన్ని ఉన్న కానీ, ఆదాయం సరిగ్గా ఉండదని కళను వృత్తిగా మార్చుకోవటానికి చాలా మంది సంకోచిస్తారు. కానీ, ఈ అమ్మాయిలు మాత్రం ఇంట్లోనే చిన్న అంకుర సంస్థను ప్రారంభించారు. చేతితో చిన్న చిన్న వస్తువులను తయారు చేస్తూ కళనే వృత్తిగా మలుచుకున్నారు. తమకు కావాల్సిన ఆదాయాన్ని వారే సంపాదించుకుంటున్నారు. వ్యాపార రంగంలో చాలా తక్కువ మంది ఆడవాళ్లు అడుగుపెడతారు. ఒక వేళ అడుగు పెట్టినా లాభ, నష్టాలు ఒత్తిళ్లకు గురై మధ్యలోనే వదిలేస్తారు. కానీ, అన్ని భయాలను తలదన్ని సొంతంగా వ్యాపారం ప్రారంభించారు హైదరాబాద్‌కు చెందిన సౌజన్య, రచన.
చిన్నప్పటి నుంచి నాకైతే ఆర్ట్ ఫిల్డ్‌లో ఉండాలనే కోరిక. ఆర్ట్ కూడా ఓ వృత్తి అవుతుందని నిరుపించాలి అనుకున్నా... అందుకే ఓ సంస్థను ఏర్పరుచుకున్నాం. 2020లో లాక్‌డౌన్ వచ్చింది. నాకు రచనకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. అప్పుడు 2021లో క్యాండిల్స్ తయారు చేశాం. అప్పటి నుంచి అంతా మారిపోయింది. మేం ఏదో ఒకటి తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. చేతితో తయారు చేసిన వస్తువుల విలువ ప్రజలకు తెలియజేయాలని మేం దీన్ని ఎంచుకున్నాం. ప్రస్తుతం అంతా బాగానే సాగుతోంది. - సౌజన్య, గాయ స్టూడియో వ్యవస్థాపకురాలు
లాక్‌డౌన్‌లో సమయంలో వచ్చిన ఓ ఆలోచన వీరితో ఒక సంస్థను ఏర్పాటు చేయించింది. వాళ్లని సొంత కాళ్ల మీద నిలబడేలా చేసింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే మిత్రులైనా రచన, సౌజన్య... తమకంటూ ఒక గుర్తింపు ఉండాలని భావించి ఇంట్లోనే ఒక పోటరీ స్టూడియో ఏర్పాటు చేశారు. అందంగా, కళాత్మకంగా కాఫీ, టీ కప్పులు, సెంటెడ్ క్యాండిల్స్ స్వయంగా తయారుచేస్తున్నారు. మార్కెట్‌లో యంత్రాలతో చేసిన సిరామిక్ కప్పులు ఎన్నో ఉంటాయి. కానీ, వీరు అలా కాకుండా చేతితో వీటిని తయారు చేస్తున్నారు. ఈ కాలంలో చేతి వృత్తులకే ఎక్కువ డిమాండ్ ఉంది. అలాగే చేతితో చేసే వస్తువులు ఎక్కువ శ్రమతో కూడుకుంది. ఐనా సరే, చేతితో తయారు చేసిన వస్తువుల విలువ ప్రజలకు తెలియజేయాలని, పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ వస్తువులు వాడాలని సూచిస్తున్నారు. ఈ యువతులు.