దాదాపు ఆరు నెలలుగా ఈ ప్రక్రియపై కసరత్తు చేస్తోన్న అధికారులు, ఇంజినీర్లు ముసాయిదాకు తుదిరూపు ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన సమీక్ష అనంతరం మరికొన్ని మార్పులు చేశారు. ముసాయిదా దస్త్రానికి ఆర్థిక శాఖ అనుమతి లభిస్తే... ఈ శాసన సభ సమావేశాల్లోనే చట్టం చేయనున్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి రావడం, ప్రాజెక్టుల కింద సాగు విస్తీర్ణం పెరగడంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా శాఖను పునర్వ్యవస్థీకరించాలని సీఎం సంకల్పించారు. 1.20 కోట్ల ఎకరాల ఆయకట్టుకు నీరందిండమే లక్ష్యంగా ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు నీటిని తరలించే విధానంలో మార్పులు తెస్తున్నారు. క్షేత్ర స్థాయిలో యంత్రాంగాన్ని బలోపేతం చేయడం పైనా దృష్టిసారించారు. భారీ, మధ్య, చిన్న తరహా... ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందకి తెస్తున్నారు.
జిల్లా స్థాయిలో నీటి పారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) తో పాటు, అన్ని విభాగాలను సీఈ పరిధిలోకి తీసుకురానున్నారు. ఎస్ఈలు, ఈఈలతోపాటు క్షేత్రస్థాయి ఇంజినీర్లందరూ సీఈ పర్యవేక్షణ కింద విధులు నిర్వర్తించేలా వ్యవస్థలో మార్పులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది సీఈలు ఉండాలని తొలుత అనుకున్నా, ఆ సంఖ్యను 28కే పరిమితం చేయాలనే నిర్ణయానికొచ్చారు.