మనలో చాలామందికి సంతకి వెళ్లి కూరగాయలు కొనుక్కోవడం తెలుసు... మరి చేనేత వస్త్రాలను సంతలో ఎప్పుడైనా కొనుక్కున్నారా? హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే సంత లక్ష్యం ఎంతో ఉన్నతమైంది. నేతన్నల సంక్షేమం, చేనేత వస్త్రాలకు ఆదరణ కల్పించడం కోసం హైదరాబాద్‌కు చెందిన సరస్వతి కవుల అనే మహిళ చేసిన ఈ ఆలోచన ఇప్పుడు వందలాది మందికి వరమైంది.. దీనికోసం కార్పొరేట్ కొలువు, కోరుకున్న జీతం వదిలేసి క్షేత్రస్థాయిలో ఆమె చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకోవాల్సిందే.
చేసే పని ఏదైనా కొందరికైనా ప్రయోజనం చేకూరాలన్నది నా ఆలోచన. అందుకేనేమో కార్పొరేట్, బ్యాంకింగ్ రంగాల్లో కొన్నేళ్ల పాటు పనిచేసినా సంతృప్తి కలగలేదు. అందుకే దాన్ని వదిలేసి క్రియేటివ్ రంగంలోకి అడుగుపెట్టా. అలా డాక్యుమెంటరీలు తీసే సమయంలోనే సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలపై చిత్రాన్ని తీయమని ఓ ఎన్‌జీవో కోరింది. అందుకోసం ఆత్మహత్య చేసుకున్న నేతదారుల కుటుంబాల్ని కలిశా. చేనేత పనికి ఆదరణ దొరక్క, చేసిన అప్పుల్ని తీర్చలేక, పవర్‌లూమ్‌లు సృష్టించిన మార్కెట్‌లో నిలబడలేక భర్తల్ని కోల్పోయిన భార్యలు, బిడ్డల్ని కోల్పోయిన తల్లులెందరితోనో మాట్లాడా. ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ. వారి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగలేదు. ఆ తర్వాత ఆ ఎన్‌జీవోతో కలిసి చేనేత కుటుంబాల సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు చేశాం. ఇదంతా చూశాక వారికి మార్కెటింగే ప్రధాన సమస్య అని అర్థమయ్యింది. చేనేతకు సరైన ప్రచారం, ఆదరణ అవసరం అనిపించింది. వారికోసం ఏదైనా చేయాలని ఆలోచిస్తున్న సమయంలోనే ఓ సంఘటన జరిగింది.
సంస్థ మూతపడటంతో...
వ్యవసాయ సహకార సంఘాల తరహాలో చేనేత కార్మికుల కోసం అప్పట్లో కొన్ని ప్రొడ్యూసర్ కంపెనీలు ఏర్పాటయ్యాయి. అలాంటి ఓ సంస్థ కొన్ని కారణాలవల్ల అకస్మాత్తుగా మూతపడింది. దాంతో చాలామంది కార్మికులు రోడ్డున పడ్డారు. వారి కోసం కనిపించిన దారే చేనేత సంత. ఈ ఆలోచన మంచిదే కానీ ఆచరణలో బోలెడు ఇబ్బందులు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో మార్కెటింగ్‌కి చక్కటి అవకాశాలు ఉన్నా...స్టాల్ పెట్టుకోవడానికి కనీస జాగా ఉచితంగా దొరకదు. నేత కార్మికులకు స్టాల్ ఏర్పాటు భారం కాకుండా ఉండేలా చూడాలనుకున్నా. మా ప్రయత్నాలు తెలిసి జిడ్డు కృష్ణమూర్తి సెంటర్ తమ స్థలంలో స్టాల్స్‌ని ఉచితంగా ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పింది. అది కొంత ఊరటనిచ్చినా... మరి వినియోగదారులు ఎలా వస్తారు. అదే అసలైన చేనేత అని వారికి అర్థం కావాలి. అందుకోసం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశాం.
వందలమందికి ఉపాధి...
మొదట నాలుగు దుకాణాలతో మొదలైంది మా సంత. నేరుగా నేతదారుల నుంచే కొనుగోలు చేసే అవకాశం కావడంతో మంచి ప్రచారం వచ్చింది. సెలబ్రిటీలు మొదలుకుని సామాన్యుల వరకూ చేనేత సంత కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. హైదరాబాద్‌తో పాటు ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచీ ఇక్కడ హ్యాండ్‌లూమ్ ఫ్యాబ్రిక్ కొనుగోలు చేయడానికే ప్రత్యేకంగా వస్తుండటం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది చేనేత కార్మికులు, వారిపై ఆధారపడిన వేలమంది ఈ సంత ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదాయం అందుకుంటున్నారు. ఇక మగ్గం ఇక నేయడం మానేద్దాం అనుకున్న కొన్ని కుటుంబాలు...తిరిగి ఉత్సాహంగా పనులు కొనసాగిస్తున్నాయి. గత ఆరేళ్లుగా క్రమం తప్పకుండా రెండు నెలలకోసారి ఈ సంత జరుగుతుంది. ఇక్కడ ఖాదీ, హ్యాండ్‌లూమ్ కాటన్, సిల్క్ వంటివి మారుతోన్న ట్రెండ్‌లకు అనుగుణంగా సాగుతున్నాయి. .ప్రత్యేకమైన దోమతెరలు, జ్యూయలరీ వంటివీ దొరుకుతాయి. మా ప్రయత్నం అర్థం చేసుకున్న నాగార్జున కమ్యూనిటీహాల్ నిర్వాహకులు నామమాత్రపు రుసుముకే ఈ అవకాశం ఇచ్చారు. ఆ మొత్తం చేనేతదారులకు భారం కాకూడదని స్నేహితుల సాయంతో నిధులు సేకరించి కొన్నేళ్ల పాటు ఏర్పాటు చేశా. ఇప్పుడు నేతన్నలే తలా కొంతవేసుకుని నిధులు సమకూర్చుతున్నారు. ఇలా మా లక్ష్యం దిశగా ముందడుగు వేస్తున్నాం.