ఒంటరిగా ఏడ్చా
నర్సింగ్ పూర్తిచేసి, 2008లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విధుల్లో చేరాను. సీఆర్పీఎఫ్ క్యాంపులో ఏడాదిన్నరపాటు పనిచేశా. ఆ తరువాత దిల్లీ జీటీబీ ఆసుపత్రిలో ఐసీయూ విభాగంలో నర్సింగ్ ఆఫీసర్‌గా తొమ్మిదేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నా. ఐసీయూకి తరలించే రోగులను మానిటరింగ్ చేయడం, వెంటిలేటర్ ఏర్పాటు చేయడం, రోగులకు ట్యూబ్ ఫీడింగ్ చేయడం, రోగి చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ చేయడం వరకు ఉండే బాధ్యతలన్నీ దగ్గరుండి పరిశీలించాలి.
అయితే మామూలు రోజుల్లో ఈ పనులు వృత్తిలో భాగంగానే చేసేదాన్ని. కానీ ఏప్రిల్ నుంచి కరోనా వైరస్‌బారిన పడిన రోగుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కొందరు ప్రాథమిక దశలోనే జాగ్రత్త పడగా చాలామంది నిర్లక్ష్యం చేశారు. దాంతో ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిపోవడం జరిగేది. సాధారణంగా జనరల్ వార్డులు రద్దీగానూ.. ఐసీయూలో ఖాళీగా ఉంటాయి. కానీ చూస్తుండగానే ఐసీయూలు కిటకిటలాడటం నా మనసుని కలచివేసింది. పరిస్థితిని అర్థం చేసుకుని పగలూ రాత్రి అని చూడకుండా ఆసుపత్రిలో పని చేసేదాన్ని. ఒక్కోసారి ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చేది.
ఇంటికి వచ్చినప్పుడు నా ఆరేళ్లకొడుకు యువరాజ్‌ను మనసారా గుండెలకు హత్తుకోలేని పరిస్థితి. వాడికేం తెలుసు... నా గురించి. దగ్గరకు తీసుకోవడం లేదని ఏడ్చేసేవాడు. ఐసీయూ నుంచి వస్తాను కాబట్టి.. నేను ఎవ్వరితోనూ కలిసేదాన్ని కాదు. నా భర్త నిఖిల్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. ఇంట్లో అమ్మ ఉంటుంది. ఆమెకు బాబును అప్పగించా. ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చేదాన్ని. వాడిని చూసుకోవడానికి కనీసం అమ్మయినా ఇంట్లో ఉంది. కానీ ఆసుపత్రిలో రోగులకు ఎవరు ఉంటారు... అని నాకు నేను సర్దిచెప్పుకునేదాన్ని. కానీ ఇంటాబయటా నన్ను ఎన్నోసార్లు వారించారు. ఇలా రాత్రీపగలు పనిచేస్తున్నావు. నీకెవరూ కిరీటం పెట్టరంటూ దెప్పిపొడిచేవారు. ఈ మధ్య కొవిడ్ పాజిటివ్ వచ్చి, ప్రమాదకరస్థితిలో ఉన్న ఓ రోగికి సీపీఆర్ చికిత్స అందిస్తున్నా. ఆ సమయంలో నేను వేసుకున్న ఫేస్ షీల్డు జారిపడిపోయింది. తిరిగి దాన్ని వేసుకోకూడదు. ఆ రోజంతా అలాగే ఉండి సేవలందించాల్సి వచ్చింది. అతడి పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఆ ప్రమాదం నాకూ ఉందని తెలుసు. ఎప్పుడో వైరస్ వస్తుందని ఇప్పటినుంచి అధైర్య పడటమెందుకు? రాష్ట్రపతి భవనం నుంచి ఆహ్వానం అందినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నన్ను విమర్శించిన వారందరికీ ఇదే సమాధానం అని భావిస్తా.