తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​ పోరు: వర్గాల వారీ రాయబేరాలు! - GHMC Election Campaign

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం పందేరాలు, రాయ‘బేరాలు’ ముమ్మరంగా సాగుతున్నాయి. కాలనీలు, అపార్టుమెంట్లలో వర్గాల వారీగా నాయకులను గుర్తించి వారితో అభ్యర్థులు మంతనాలు జరుపుతున్నారు. ఏం కావాలో అడిగి హామీలిస్తున్నారు.

గ్రేటర్​ పోరు: వర్గాల వారీ రాయబేరాలు!
గ్రేటర్​ పోరు: వర్గాల వారీ రాయబేరాలు!

By

Published : Nov 29, 2020, 7:43 AM IST

హైదరాబాద్​ ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని ఓ డివిజన్‌లో తీవ్ర పోటీ ఉన్న మూడు ప్రధాన పార్టీల తరఫున ఒకే వర్గం అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆ వర్గం ఓట్లు చీలిపోతాయన్న ఆందోళనతో అభ్యర్థులు తమ పార్టీల ప్రధాన నేతలను సైతం పిలిపించి కాలనీల ప్రముఖులకు హామీలిప్పిస్తున్నారు. ఇలా ఒక పార్టీ తరువాత మరో పార్టీ రాష్ట్రస్థాయి నేతలు పిలిచి మాట్లాడారని ఓ కాలనీ ప్రముఖుడు వివరించారు. తమ కాలనీÅలో రాత్రిపూట చీకటి ఆవరిస్తోందని చెబితే వెంటనే విద్యుత్తు స్తంభాలు వేయిస్తామని 3 పార్టీల వారూ హామీ ఇచ్చారని తెలిపారు. ఇలా ఒకే వర్గం అభ్యర్థులు పోటీ పడుతున్న చోట కాలనీలు, అపార్టుమెంట్ల ప్రముఖులకు డిమాండ్‌ పెరిగింది.

వర్గనేతల మంతనాలు

ఓ అపార్టుమెంటు సంక్షేమ సంఘంలో రెండు సామాజికవర్గాలకు చెందిన వారు తమ మాటే చెల్లుతుందని వేర్వేరుగా పార్టీల అభ్యర్థులకు చెప్పి మంతనాలు జరిపారు. కానీ వీరు వెళ్లి ‘ఫలానా పార్టీకే ఓటు వేయాల’ంటూ అపార్ట్‌మెంటువాసులను కోరితే... ‘మీరెవరు చెప్పడానికి? మా ఇష్టమొచ్చిన పార్టీకే వేసుకుంటాం’ అని వారు ఎదురుతిరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం అభ్యర్థులకు తెలియకుండా చూడాలని సంఘం నేతలు తంటాలు పడుతున్నారు. అభ్యర్థుల ఆరాటాన్ని సొమ్ము చేసుకునేందుకు కొన్ని కాలనీలు, అపార్టుమెంట్లలోని సంఘాలు, వర్గాల నాయకులు మంతనాలు జరుపుతున్నారు. వీరికి డబ్బు ఇచ్చినా, ఓటర్లందరికీ పంచుతారా అనేది అనుమానమేనని, ఎదుటి పార్టీ వారు ఇస్తుండటంతో తామూ ఇవ్వక తప్పడం లేదని ఓ ప్రధాన పార్టీ నాయకుడు తెలిపారు. కొందరు అభ్యర్థులు నగదుకు బదులు వస్తువులు పంచడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

వేడినీళ్లు తాగండి.. ఓటేయండి...

  • కరోనా నేపథ్యంలో వేడినీళ్లు తాగడానికి పనికొస్తాయంటూ... దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ బహుళ అంతస్తుల ప్రాంతంలో ఓ పార్టీ వారు 200 కుటుంబాలకు వాటర్‌ కెటిళ్లు పంపిణీ చేసినట్లు తెలిసింది.
  • నగరంలోని తూర్పు ప్రాంతంలో ఓ పార్టీ అభ్యర్థి ఓ సామాజికవర్గంలోని 220 ఓట్ల కోసం ఆ వర్గ నాయకుడికి తాయిలం అందించారు.
  • ఈఎస్‌ఐఎల్‌ ప్రాంతంలో 400 ఓట్లున్న ఒకచోట విద్యార్థులు, మహిళలు బస్సులు ఎక్కే సమయంలో ఎండ, వానలకు ఇబ్బంది పడుతున్నారని స్థానిక నాయకులు చెప్పడంతో బస్టాపు, కూర్చునేందుకు వసతి, తాగునీటి సదుపాయం కల్పించేందుకు ఓ నాయకుడు ఒప్పందం రాసిచ్చినట్లు సమాచారం.

ఇదీ చదవండీ:పట్టువదలని రైతన్న.. ఉద్ధృతంగా 'దిల్లీ చలో'

ABOUT THE AUTHOR

...view details