ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్దదైన బస్టాండ్ విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉన్న ఇక్కడి నుంచి నిరంతరం పలు రాకపోకలు సాగుతుంటాయి. నిత్యం 3 వేల బస్సులు నడుస్తుంటాయి. ఏపీలోని అన్ని జిల్లాలు, పట్టణాలకు నిరంతరం బస్సులు తిరుగుతాయి. తెలంగాణలోని హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక, సహా ఇతర రాష్ట్రాల్లోని పట్టణాలు, జిల్లాలకు ప్రయాణికులు వెళ్లివస్తుంటారు. రోజుకు లక్షమందికి పైగా ప్రయాణం చేస్తుంటారు.
ఆధునికీకరణ
లాక్‌డౌన్‌తో 2 నెలలపాటు వెలవెలబోయిన బస్టాండ్.. ఇన్నాళ్లకు మళ్లీ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. బస్టాండ్‌లో 72 ప్లాట్ ఫాంలు ఉండగా.. వాటన్నింటినీ సీసీ కెమెరాల పరిధిలోకి తెచ్చారు. రాజధాని పరిధిలో ఉన్నందున 2016లోనే బస్టాండ్‌ను పూర్తిగా ఆధునీకరించి నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల వీటి సంఖ్య మరింత పెంచారు. ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అధికారులు... బస్సు ఎక్కేవారు, దిగేవారు, ప్లాట్ ఫాంపై వేచి ఉండే వారందరినీ నిరంతరం చిత్రీకరించేలా బస్టాండ్‌లో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ అనుసంధానించి కొన్నింటిని పోలీసు కమాండ్ కంట్రోల్ రూంకు.. మరికొన్ని స్థానిక కంట్రోల్ రూంకు అనుసంధానించారు. పార్కింగ్ ఏరియాలోనూ కెమెరాలు అమర్చి.. పరిస్థితులను పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు.