CM KCR 4 Years Administration: తెలంగాణలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్... మలిదఫా పాలనలో నాలుగేళ్ల కాలం పూర్తిచేసుకున్నారు. 9 నెలల గడువుండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘనవిజయంతో 2018 డిసెంబర్ 13న రెండోసారి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. తొలిదఫాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును... రెండోవిడతలో జాతికి అంకితం చేసిన ఆయన... ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల పనుల వేగవంతంపై దృష్టిసారించారు. ఐతే ఇటీవలి గోదావరికి వచ్చిన భారీవరదలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన రెండు పంపుహౌస్‌లు నీటమునిగి దెబ్బతినడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేసి దశలవారీగా పుంపుల్ని అందుబాటులోకి తెస్తున్నారు.
సవాల్‌గా ధరణి సమస్యలు :కాళేశ్వరంతో ఇతర సాగునీటి ప్రణాళికలతో భూగర్భమట్టం పెరిగి వరి ఉత్పత్తి రికార్డుస్థాయికి చేరింది. ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్, దిల్లీలో కేసీఆర్ ఆందోళనకు దిగారు. రెవెన్యూ సంస్కరణల్లో తెచ్చిన ధరణి మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. రికార్డుల్లో ఇబ్బందిలేనివారి భూలావాదేవీలు నిమిషాల్లో పూర్తవుతున్నాయి. వివాదాలతోపాటు ఇతర కారణాలు, ఉన్నవారికి ఉపశమనం కలగలేదు. కొన్నిచోట్ల భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లడం, పేర్లు, విస్తీర్ణం నమోదులో పొరపాట్లతో ధరణి సమస్యలు సవాల్‌గా మారాయి. వాటి పరిష్కారానికి చేసిన కసరత్తు కొలిక్కిరాలేదు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా వీఆర్వో వ్యవస్థ చరిత్రలో కలిసిపోయింది. పోడు సమస్య కొనసాగుతూనే ఉంది. పోడుసాగుదార్లకు పట్టాలిస్తామన్న హామీ అమలుకాలేదు. గతంలో చేపట్టిన కసరత్తు మధ్యలోనే నిలిచిపోగా... మరోదఫా ప్రక్రియ సాగుతోంది. గిరిజనులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి ఈ క్రమంలో కొన్నిసార్లు విలువైన ప్రాణాలు పోతున్నాయి.
జిల్లాకు ఒక వైద్యకాలేజీ :ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. అప్రమత్తమైన ప్రభుత్వం... ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టానికి ఆసుపత్రుల స్థాయిపెంపు, కొత్తవాటి నిర్మాణాన్ని వేగవంతం సహా వైద్యులు, సిబ్బందినియామక ప్రక్రియ చేపట్టింది. జిల్లాకు ఒక వైద్యకాలేజీ లక్ష్యంగా... ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటుచేస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో 8 ప్రారంభం కాగా... వచ్చే ఏడాది మరో తొమ్మిదింటిని ప్రారంభించేందుకు సిద్ధమైంది. రాష్ట్రం నుంచి వచ్చిన కోవాక్జిన్, ఇతరటీకాలు ప్రాణాలపై భరోసా నింపాయి. హైదరాబాద్ పోలీస్‌కమిషనరేట్‌కి కమాండ్‌కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. పాతసచివాలయ భవనాలు కూల్చేసి.. కొత్తవి నిర్మిస్తోంది. సంక్రాంతి తర్వాత ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
రాష్ట్రంలో ప్రముఖసంస్థల పెట్టుబడులు : అమరవీరుల స్మారకం, అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పనులు వేగంగా సాగుతున్నాయి. పలు జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలు అందుబాటులోకి రాగా... మిగతావి వివిధదశల్లో ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాంతీయ వలయ రహదారి - ఆర్ఆర్ఆర్ పనులు ప్రారంభంకావాల్సిఉంది. పూర్తిగా ప్రభుత్వనిధులతోనే... రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టును సర్కార్ చేపట్టింది. హైదరాబాద్‌తోపాటు ఇతర చోట్లా మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో కొన్ని పూర్తి కాగా. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రంలో అమెజాన్, అమరరాజా, తదితర ప్రముఖసంస్థల పెట్టుబడులు పెట్టాయి. స్థిరాస్తిరంగం ఊపందుకోవడంతో ఇళ్ల విక్రయాలు జోరందుకున్నాయి.
ఎస్సీ రిజర్వేషన్ల పెంపుపై ఉత్తర్వులు : దళితబంధు పేరిట కొత్త పథకాన్ని తెచ్చిన సర్కారు... ఒక్కో కుటుంబానికి 10 లక్షల రాయతీతో జీవనోపాధి కల్పిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం... యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో అమలు చేశారు. ఆనంతరం నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లోని ఒక్కో మండలంలో పూర్తిస్థాయిలో అమలుచేయగా.. మిగిలిన చోట్ల దశలవారీగా అమలుకు శ్రీకారం చుట్టింది. అదే తరహాలో గిరిజనబంధు అమలుచేస్తామని... కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంతో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్రప్రభుత్వమే ఉత్తర్వు జారీచేసింది.