Somu Veer Raju On Liquor Prices: పేదవాడిని దృష్టిలో పెట్టుకొని మద్యంపై తాను మాట్లాడిన మాటలకు ఇతర పార్టీల నాయకులు పెడర్థాలు తీస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీ రాజమహేంద్రవరంలోని భాజపా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో తనకు తెలుసన్నారు. కేటీఆర్ తండ్రి తెల్లవారుజాము మూడు గంటల వరకు ఏం చేస్తారో అందరికీ తెలిసిందేనన్నారు. చీప్‌లిక్కర్‌ను రూ.50కి అమ్మితే ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షలు మిగులుతాయన్నారు. గుంటూరు జిన్నా టవర్, విశాఖ కింగ్‌జార్జి ఆసుపత్రి పేర్లను వైకాపా ప్రభుత్వం మార్చాలన్నారు. కేజీహెచ్‌కు గౌతు లచ్చన్న లేదా తెన్నేటి విశ్వనాథం పేరు పెట్టాలన్నారు.
రూలింగ్ కాదు... ట్రేడింగ్ చేస్తున్నారు...
ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం విక్రయాల ద్వారా రూ.175 కోట్లు తినేస్తున్నారని విమర్శించారు. ఒక మంత్రి ఇల్లు సివిల్ సప్లై విభాగం ఎండీ కట్టేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార పార్టీ వారు రూలింగ్ చేయడం లేదని, ట్రేడింగ్ చేస్తున్నారన్నారు. సిమెంటు ధర పెరిగినప్పుడల్లా బస్తాకు రూ.30 తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే సిమెంట్ బస్తా రూ.280 విక్రయించడంతో పాటు విద్యార్థులకు నాటుకోడి గుడ్లు పెట్టిస్తామన్నారు.