కొంత నిర్లక్ష్యం, మరికొంత అవగాహన లోపం.. కొవిడ్ రోగుల్లో తీవ్రతకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అశాస్త్రీయ విధానాలు పాటిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్నేహితులు, సహచరులకు కొవిడ్ సోకినట్టు నిర్ధారణ కాగానే కొందరు టీకా కోసం పరుగులు తీస్తున్నారు. అప్పటికే వారిలో కొంతమంది వైరస్ బారినపడినా లక్షణాలు కనిపించకపోవడంతో ఇటువంటి తప్పిదాలు చేస్తున్నారని వైద్యులు విశ్లేషిస్తున్నారు.
టీకా వల్లనే అనుకుని..
అనంతరం లక్షణాలు కనిపించినా.. టీకా ప్రభావమనే భ్రమలో గడిపేస్తున్నారు. వాస్తవానికి టీకా తీసుకున్నాక కొద్దిమందిలో జ్వరం, ఒళ్లునొప్పులు ఒకటి రెండ్రోజులు మాత్రమే ఉంటాయని డా.శ్రీనివాస్ తెలిపారు. టీకా తీసుకున్నాక, కొవిడ్ లక్షణాలను ఒకే గాటిన కట్టేసి.. అయోమయంలో ఉండటం కొన్నికేసుల్లో మరణాలకు దారితీసిందని నగరానికి చెందిన ప్రముఖ పల్మనాజిస్టు ఒకరు తెలిపారు. ఇంటి వైద్యంతో కాలయాపన చేయొద్దని నిమ్స్ ఆసుపత్రిలోని ప్రముఖ మూత్రపిండ వైద్యనిపుణులు డా.శ్రీభూషణ్‌రాజు సూచించారు. పూర్తిగా కోలుకున్నా.. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా టీకా వేయించుకోవాలని స్పష్టంచేశారు.
సకాలంలో గుర్తించక..
నార్సింగికి చెందిన ఓ భవన నిర్మాణ ఉద్యోగికి.. తాను పనిచేసేచోట కూలీలకు కొవిడ్ సోకినట్లు తెలిసింది. అప్పటికే కాస్త జ్వరంగా ఉండటంతో.. మాత్రలు వేసుకున్నారు. మరుసటి రోజు కొవిడ్ టీకా వేయించుకున్నారు. తెల్లవారి ఒళ్లునొప్పులు, జ్వరం పెరిగింది. టీకా కారణమంటూ భావించి విధుల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి.. మృతి చెందారు. వైరస్‌ను సకాలంలో గుర్తించకపోవడం, సొంత నిర్ణయంతో ఆలస్యం చేయడమే కారణమంటూ మృతుడి స్నేహితులు తెలిపారు.