తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ-చలానాను ఇలా తప్పించుకుంటున్నారు

ద్విచక్రవాహనం నంబర్ ప్లేట్లు విరిగిపోయి, ఓ వైపు వంగిపోయి కనిపిస్తాయి. పాపం ఏదైనా ప్రమాదం జరిగి అలా అయ్యిందేమో అనుకుంటాం. నంబర్ ప్లేటుపై నల్ల రంగులో ఉండాల్సిన అక్షరాలు తెలుపు రంగులోకి మారిపోయుంటాయి. పాతబడి రంగు పోయిందేమో అనుకుంటాం. నంబర్ ప్లేటు కనబడకుండా అడ్డంగా వాహనం వెనకాల ఏవేవో కడ్తూ ఉంటారు. ఏదైనా అవసరంతో అలా కట్టి ఉంటారనుకుంటాం. కానీ తరచి చూస్తే తప్ప అర్థం కాదు అదంతా ట్రాఫిక్ పోలీసులకు మస్కా కొట్టి ఈ-చలానా నుంచి తప్పించుకోవడానికే.

ఈ-చలానాను ఇలా తప్పించుకుంటున్నారు

By

Published : Jun 28, 2019, 1:52 PM IST

Updated : Jun 28, 2019, 9:30 PM IST

ఈ-చలానాను ఇలా తప్పించుకుంటున్నారు

ఈ-చలానా... నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపితే ఫోటోలు తీసి నేరుగా ఇంటికే జరిమానా పంపించే విధానం. దీని వల్ల రోడ్డు భద్రతతో పాటు ట్రాఫిక్​ ఉల్లంఘనలు తగ్గుతాయని పోలీసులు భావించారు. అయితే కొందరు దీనిని అదునుగా తీసుకుని తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు. నంబరు ప్లేట్​ కనిపించకుండా జాగ్రత్త వహిస్తూ... ట్రాఫిక్​ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. తప్పులు చేసినా శిక్షలు పడకుండా తప్పించుకొని దర్జాగా రోడ్ల మీద తిరుగుతున్నారు.

జరిమానా తప్పించుకునేందుకు

ద్విచక్ర వాహనం నంబర్ ప్లేట్ కనిపించకుండా వాహనదారులు చేసే ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. నంబర్ ప్లేట్​పై ఉన్న ఒక అంకె కనిపించకుండా ప్లేట్ కొనను వంచడం, నలుపు రంగులో ఉన్న అక్షరాలకు తెలుపు రంగు వేయడం వంటివి చేస్తూ పోలీసులకు టోకరా వేస్తున్నారు. వీటిని గమనించిన ట్రాఫిక్ పోలీసులకు ఏదో ఒక సాకు చెప్తూ తప్పించుకుంటున్నారు. కాస్త తరచి చూస్తే ..వందల సంఖ్యలో ఇలాంటి వాహనాలు రోడ్లపై మనకు కనిపిస్తాయి.

సంవత్సరం గడిచినా...

కొత్త వాహనం కొనగానే వీలయినంత తొందరగా నంబర్ ప్లేట్​ను తీసుకోవాల్సి ఉంటుంది. శాశ్వత రిజిస్ట్రేషన్​ నంబర్​ వచ్చే సరికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు ఆగలేక ద్విచక్రవాహనాలను నడిపేస్తూ ఉంటారు చాలా మంది. కొందరు బండి కొని సంవత్సరం గడుస్తున్నా నంబర్ ప్లేట్ పెట్టుకోకుండానే తిరుగుతుంటారు. మరికొందరైతే... ఏళ్లు గడిచినా నంబర్ ప్లేట్​ లేకుండానే గడిపేస్తున్నారు. బండి డొక్కుగా మారినప్పటికీ... ప్లేట్​లు కనిపించవు.
డిజిటలీకరణ వైపు అడుగులేస్తున్న ప్రభుత్వం....ఈ-చలానాను తప్పించుకునేందుకు వాహనాదారులు చేస్తున్న తప్పులను గుర్తించాలి. చిన్న అక్షరం కనిపించకపోయినా వెంటనే కొత్త నంబర్ ప్లేటు అమర్చేలా చర్యలు చేపట్టాలి. కావాలని నంబర్ ప్లేటుపై అక్షరాలు కనిపించకుండా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పాత వాహనాలకూ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు అమర్చాలి. అప్పుడే ఈ-చలనా వ్యవస్థను సమర్థంగా అమలు చేయొచ్చు.

ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ

Last Updated : Jun 28, 2019, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details