తెలంగాణ

telangana

ETV Bharat / state

Skin Bank At Osmania: ఉస్మానియాలో 'స్కిన్ బ్యాంక్'​.. దిగ్విజయంగా ఏడాది పూర్తి - ఉస్మానియాలో చర్మ నిధి

Skin Bank At Osmania: ఊహించని ప్రమాదాలు.. ఆవేశంలో తీసుకునే ఆత్మహత్య నిర్ణయాలతో ఎంతోమంది అగ్నికి అహుతి అవుతుంటారు. మంటల్లో కాలిన వారిని కాపాడుకునే అవకాశం ఉన్నా ఆర్థిక స్థోమత లేక ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో "స్కిన్ బ్యాంక్"ని అందుబాటులోకి తెచ్చిన ఉస్మానియా ఆస్పత్రి దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసింది . ఈ కాలంలో 'చర్మ నిధి' ఉపయోగాలు, ఆస్పత్రి సాధించిన విజయాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Skin Bank At Osmania
ఉస్మానియాలో 'స్కిన్ బ్యాంక్'​

By

Published : Jun 15, 2022, 3:30 PM IST

Skin Bank At Osmania: మానవశరీరంలో అతిపెద్ద భాగం. అత్యంత ముఖ్యమైనది చర్మమే. దేహంలోని భాగాలకు బయట నుంచి ఎలాంటి హానీ లేకుండా ముందస్తుగా కాపాడేదీ చర్మమే. అలాంటి చర్మం దాదాపు 40 శాతం కాలినా ప్రాణానికి ముప్పే. కాలిన గాయాల ద్వారా బ్యాక్టీరియా, ఫంగస్‌ శరీరంలోకి చేరి, ఇన్‌ఫెక్షన్లు కలిగించటమే కాదు..మరణానికి దారితీస్తాయి. కాలిన గాయాలకు చికిత్స తీసుకున్నా అంత త్వరగా మానటం కష్టమే. ఈ నేపథ్యంలోనే అగ్నిప్రమాదాల బారినపడిన వారు కోలుకునేలా చేస్తాయి "స్కిన్ గ్రాఫ్ట్"లు. కిడ్నీ, లివర్‌ వంటి అవయవాలను దాతల నుంచి సేకరించి బాధితులకు ఎలాగైతే అందిస్తారో అదేవిధంగా చనిపోయిన వారి శరీరం నుంచి చర్మాన్ని వేరుచేసి... వాటి గ్రాప్ట్‌లు తయారు చేసి రోగులకు అందించవచ్చు. దేశంలో కేవలం 3 స్కిన్ బ్యాంకులు మాత్రమే అందుబాటులో ఉండగా గతేడాది జూన్‌లో రోటరీ క్లబ్, హెటిరో సంస్థల సహకారంతో ఉస్మానియా ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చింది'చర్మనిధి'.

పద్దెనిమిదేళ్లు పైబడి ఎయిడ్స్ వంటి తీవ్ర వ్యాధులు లేకుండా మరణించిన వారి శరీరం నుంచి మనిషి చనిపోయిన ఆరు గంటల్లోపు చర్మాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఒక్కో దేహంతో వెయ్యి నుంచి 2,500 చదరపు సెంటీమీటర్ల చర్మాన్ని సేకరించే అవకాశం ఉంది. కాలిన గాయాలకు చికిత్స అందించే అతిపెద్ద విభాగాన్ని కలిసిన ఉస్మానియా వైద్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. గతేడాదిలో ఆరుగురు మృతుల నుంచి చర్మాన్ని సేకరించిన వైద్యులు... బ్యాక్టీరియా, ఫంగల్ వైరస్‌లు సోకకుండా శుద్ధిచేసి, ఫ్రీజర్లలో భద్ర పరుస్తున్నారు. అలా భద్రపరిచిన వాటినే స్కిన్‌గ్రాఫ్ట్‌గా చెబుతుంటారు. ఒక్కసారి స్కిన్ గ్రాఫ్ట్‌ని ఫ్రీజర్​లో ఉంచితే ఐదేళ్ల వారకు ఎప్పుడైనా వాడుకునే అవకాశం ఉంటుంది.

ఉస్మానియాలో 'స్కిన్ బ్యాంక్'​.. దిగ్విజయంగా ఏడాది పూర్తి

గడిచిన ఏడాది కాలంలో తీవ్రంగా కాలి, గాయాలైన 8 మంది రోగులను కాపాడేందుకు వైద్యులు స్కిన్ గ్రాఫ్ట్‌లు ఉపయోగించారు. ఇందుకోసం 6వేల చదరపు సెంటీమీటర్ల చర్మం వినియోగించారు. ఇక ప్రస్తుతం ఉస్మానియాలో మరో 5 వేల చదరపు సెంటీమీటర్ల చర్మం ప్రాసెస్ పూర్తి కాగా... మరో 2వేల చదరపు సెంటీమీటర్లు ప్రాసెస్ జరుగుతోంది. దీంతో మరో 8 మంది రోగులకు సరిపడా సిద్ధంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 'స్కిన్ బ్యాంక్' ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేదలకు మంచి వైద్యం అందించి ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు ఉస్మానియా వైద్యులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details