Skill test for Driver and Mechanic constable in Telangana : డ్రైవర్, మెకానిక్ కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్చి 2 నుంచి స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు నియామక మండలి పేర్కొంది.
పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్, మెకానిక్, డ్రైవర్లు, విపత్తు నిర్వహణ విభాగంలో అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు. అంబర్‌పేట్‌లోని సీఏ ఆర్ హెడ్ క్వార్టర్స్‌లో మార్చి 2 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహిస్తామని నియామక మండలి ప్రకటించింది. అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 28 అర్ధరాత్రి వరకు అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
దేహదారుఢ్య పరీక్షలో గర్భిణీలకు, బాలింతలకు మరో ఛాన్స్:ఆరోగ్య కారణాల రీత్యా దేహదారుఢ్య పరీక్షకు హాజరుకాని.. గర్భిణీలు, బాలింతలకు మరోసారి పోలీస్ నియామక బోర్డు అవకాశం ఇచ్చింది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించి మెయిన్స్‌లో కూడా అర్హత పొందాక ఫిజికల్ టెస్ట్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ పరీక్షలో పాల్గొనేందుకు మెడికల్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా సమర్పించాలని పోలీసు నియామక మండలి అధికారులు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ లోగా డీజీపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత గర్భం దాల్చిన స్త్రీలకు ఇంకొక అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. 2022 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న 40 మంది అభ్యర్థులు ఇప్పుడు గర్భం దాల్చడంతో తమకూ మరో అవకాశం ఇవ్వాలని కరీంనగర్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. గతంలో కూడా ఇలాగే 11 మంది మహిళలు కోరితే అనుమతిచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు వారిలాగే తమకు కూడా ఇవ్వాలని అనుమతి ఇవ్వాలని కోరారు. వీరి ఆందోళనలకు దిగివచ్చిన పోలీస్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇవీ చదవండి: