SIT Petition for Paper Leakage Accused Custody : రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈ వ్యవహారం నడిచిందంటూ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ తనదైన శైలిలో నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా.. మరోవైపు బీజేపీ రాష్ట్ర సర్కార్‌పై పేపర్ లీకేజీ కేసులో ఆరోపణలు చేస్తూ ధర్నాలు చేపడుతోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితులను ఆరు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించగా రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి.
అయితే నిన్నటితో నిందితుల కస్టడీ ముగియడంతో తాజాగా మరోసారి పేపర్ లీకేజీ కేసులో మరోసారి నిందితుల కస్టడీ కోసం కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, డాక్యా, రాజేశ్వర్‌తో పాటు నిన్న అరెస్టు చేసిన షమీం, రమేష్, సురేష్‌ను కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో సిట్ పిటిషన్ వేసింది. ఈ ఏడుగురిని ఆరు రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో సిట్ అధికారులు కోరారు. సిట్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై రేపు నాంపల్లి కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది.