లాక్డౌన్ సమయంలో కూడా విద్యుత్ సంస్థలకు అవసరమైన బొగ్గును సరఫరా చేసినట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. గనుల వారీగా ఉత్పత్తి , ఓవర్ బర్డెన్ తొలగింపు పనులు, బొగ్గు రవాణా తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సంస్థను కాపాడుకుంటూ ముందుకెళ్లడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా సింగరేణిని సజావుగా నడిపేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎండీ సూచించారు.
'సింగరేణి కార్మికులు ఆ పరిస్థితులను అధిగమించాలి'
కరోనా పరిస్థితులు, వర్షాకాలం బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తిపై ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
అయితే పరిశ్రమలు అన్ని తిరిగి ప్రారంభమైతే వాటికి బొగ్గు ఉత్పత్తి, రవాణా పూర్తిస్థాయిలో చేసేందుకు సిద్ధం కావాలన్నారు. కరోనా వ్యాప్తి నివారణ జాగ్రత్తలు ఇదే విధంగా కొనసాగించాలన్నారు. కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని కోరారు. జూన్ రెండో వారం నుంచి వర్షాలు ప్రారంభం కానున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా ఉనికి జులై నెల వరకు ఉండే అవకాశం ఉందని పలువురు నిపుణులు అంచనాలు వేస్తున్నారని అన్నారు.
ఇదీ చూడండి :'సామర్థ్యం పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది'