రాష్ట్రంలో కంది, సోయా విత్తనాల కొరత రైతులను వేధిస్తోంది. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచడంతో పాటు నాసిరకం, పాత విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఈ ఏడాది కంది సాగు పెంచాలని వ్యవసాయశాఖ పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా.. ఆ మేర విత్తనాలను సేకరించలేదు. తాజాగా టెండర్లు పిలిచింది. సోయా విత్తనాలకు దేశవ్యాప్తంగా కొరత ఉందని చెబుతూ రాయితీపై పంపిణీని విరమించుకుంది.
*గతేడాది క్వింటా కంది విత్తనాలను రూ.8,393కి విక్రయించగా, ఇప్పుడు కొరత పేరుతో ప్రభుత్వమే రూ.9,270గా నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌లో రూ.9,500 నుంచి 10 వేల వరకూ వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో సాగుకు 20 వేల క్వింటాళ్లకు పైగా కంది విత్తనాలు అవసరం కాగా.. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వద్ద 1900 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ‘ఉజ్వల’(పీఆర్‌జీ-176) రకం కంది మూల విత్తనాలను క్వింటా రూ.18 వేలకు అమ్ముతోంది. దీంతో వచ్చే పంటను రెండేళ్లు విత్తుగా ఉపయోగించుకోవచ్చు.