తెలంగాణ

telangana

ETV Bharat / state

వసతులున్నాయ్‌.. సిబ్బంది ఏరీ? - ప్రాంతీయ ఆస్పత్రులు

ప్రభుత్వం లక్షలు వెచ్చించి పెద్ద ఆసుపత్రి కట్టింది.. అక్కడ వైద్యులు, సిబ్బంది లేకపోతే? పోనీ వైద్యులున్నారని అనుకుందాం.. సజావుగా వైద్యం అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కొరవడితే? ఈ రెండు ఉదంతాల్లోనూ కష్టపడేది... నష్టపోయేది పేద, మధ్యతరగతి వర్గాలే.

shortage-of-medical-staff-in-regional-hospitals-in-telangana
వసతులున్నాయ్‌.. సిబ్బంది ఏరీ?

By

Published : May 14, 2021, 7:45 AM IST

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతీయ ఆసుపత్రుల్లో అందుతున్న కొవిడ్‌ సేవలను పరిశీలించగా సౌకర్యాలు పెరిగినా వైద్యులు, సిబ్బంది కొరత ప్రధానంగా వేధిస్తున్నట్టు దృష్టికొచ్చింది. దాదాపు అన్ని ప్రాంతీయ ఆసుపత్రుల్లోనూ సుమారు 50 శాతానికి పైగా వైద్యసిబ్బంది పోస్టులు ఖాళీలున్నాయి. మరీ ముఖ్యంగా కొవిడ్‌ సేవలకు అవసరమైన జనరల్‌ మెడిసిన్‌, మత్తు, పల్మనాలజీ విభాగాల వైద్యులతో పాటు నర్సుల కొరత అధికంగా ఉంది. కొన్నిచోట్ల సాంకేతిక నిపుణులు లేకపోవడంతో వెంటిలేటర్లను పక్కన పడేశారు. ఇప్పుడున్న సిబ్బందే ఇటు సాధారణ వైద్య సేవల్లోనూ, మరోవైపు కొవిడ్‌ విధుల్లోనూ పాల్గొనాల్సి రావడంతో.. రెండుచోట్లా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైగా వైద్యసిబ్బంది కూడా వైరస్‌ బారిన పడుతుండడంతో.. వారు 2 వారాలకు పైగా విధులకు హాజరు కాలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్కో నర్సు కొన్ని సందర్భాల్లో 24 గంటలు కూడా విధుల్లో ఉండాల్సి వస్తోంది.

భద్రాచలంలోని దుస్థితి

ఇది భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డు. ఈ ఆసుపత్రిలో 200 పడకలు ఉండగా.. 125 పడకలతో కొవిడ్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అన్ని పడకలకూ ఆక్సిజన్‌ సదుపాయం కల్పించారు. త్వరలో ఇక్కడ ఆక్సిజన్‌ ఉత్పత్తి యూనిట్‌ కూడా ప్రారంభం కానుంది. ఐసీయూలో 28 పడకలు.. రెండు వెంటిలేటర్లు ఉన్నాయి. కొవిడ్‌ విజృంభిస్తుండడంతో.. నిత్యం అన్ని పడకలూ దాదాపు నిండుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ సేవలందించేందుకు తగినంతమంది సిబ్బంది లేదు. కొవిడ్‌ సేవల్లో పాల్గొనేందుకు అదనంగా ముగ్గురు అనస్థిటిస్టులు, ఇద్దరు జనరల్‌ ఫిజీషియన్లు, 8 మంది స్టాఫ్‌ నర్సులు, నలుగురు మేల్‌ నర్సులు, ముగ్గురు వెంటిలేటర్‌ టెక్నీషియన్లు, 8 మంది పేషెంట్‌ కేర్‌ సిబ్బంది, ముగ్గురు భద్రతా సిబ్బంది కావాలనే ప్రతిపాదనలున్నాయి. వాటిపై ఉన్నత స్థాయిలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల అక్రమాల వ్యవహారంలో ముగ్గురు సిబ్బందిపై వేటు పడింది. వారి పోస్టులను కూడా తక్షణమే భర్తీ చేయాలి. ప్రస్తుతం ఆసుపత్రిలో రోగుల సంఖ్యకు తగ్గట్లుగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల సరఫరా లేదు. మరో 2 వెంటిలేటర్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.

ఒక్క భద్రాచలం ఏరియా ఆసుపత్రిలోనే కాదు..రాష్ట్రంలోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో దాదాపుగా ఇదే స్థితి నెలకొంది. వాటిలో అందుతున్న కొవిడ్‌ సేవలను పరిశీలించగా వసతులు పెరిగినా వైద్యులు, సిబ్బంది కొరత ప్రధానంగా వేధిస్తున్నట్లు దృష్టికొచ్చింది. ఆ వివరాలతో ప్రత్యేక కథనం..

ప్రస్తుత సేవలు ఇలా..

కరోనా ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడే చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రాంతీయ ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రాంతీయ ఆసుపత్రులకు సరఫరా చేసిన వెంటిలేటర్లను కొవిడ్‌ చికిత్సల్లో వినియోగించుకోవడానికి అనుమతిచ్చింది. త్వరలో 3 వేల పడకల్లో ఆక్సిజన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. కానీ అసలు చికిత్సల్లో పాల్గొనే వైద్యసిబ్బంది విషయంలోనే కొరత ఏర్పడింది. కొవిడ్‌ విజృంభణను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇటీవలే కొత్తగా 50వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించుకోవడానికి అనుమతిచ్చింది. కనీసం ఇప్పుడైనా అవసరాల మేరకు నియామకాలు చేపట్టకపోతే మున్ముందు ప్రాంతీయ ఆసుపత్రుల్లో వైద్యసేవలకు మరింత కష్టమనే అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.

ఒక్కరే టెక్నీషియన్‌

బెల్లంపల్లిలోని స్థానిక కొవిడ్‌ ఆసుపత్రిలో మరణ మృదంగం కొనసాగుతోంది. రెండోదశలో ఇప్పటి వరకూ ఆసుపత్రిలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల 36 గంటల వ్యవధిలోనే 12 మంది కొవిడ్‌తో మృతి చెందారు. ఆసుపత్రిలో 16 వెంటిలేటర్లు.. 150 పడకలున్నాయి. ఇటీవల మరణాల సంఖ్య పెరగడంతో 8 మంది మత్తు వైద్యనిపుణులు, ఒక ఛాతీ వైద్యుడు, ఒక టెక్నీషియన్‌ను నియమించారు. ప్రస్తుతం ఇక్కడ 14 మంది వైద్యులు, 24 మంది నర్సులు, నలుగురు ఫార్మసిస్టులు పనిచేస్తున్నారు. ల్యాబ్‌, ఎక్స్‌రే టెక్నిషియన్లు ముగ్గురు, అంబులెన్స్‌ డ్రైవర్లు 8 మంది విధులు నిర్వహిస్తున్నారు. సింగరేణి సంస్థకు చెందిన నాలుగు అంబులెన్స్‌లు ఉన్నాయి.

మెరుగుపడాలంటే...

ఆక్సిజన్‌ టెక్నీషియన్‌ ఒక్కరే ఉండడంతో 24 గంటలూ ఒక్కరే సేవలందించడం కష్టమవుతోంది. కనీసం మరో ఇద్దరు కావాలి. త్వరలోనే 200 పడకలకు పెంచడానికి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో.. మానవ వనరుల సంఖ్యను రెట్టింపు చేయాలి. ముఖ్యంగా ఆక్సిజన్‌ సేవలు అవసరమైన రోగుల సంఖ్య ఇక్కడ ఎక్కువ. రోజూ 50 వరకూ బల్క్‌ సిలిండర్లు అవసరమవుతున్నాయి. వెంటిలేటర్ల రోగులు కూడా పెరగడంతో ఆక్సిజన్‌ వినియోగం మరింత పెరిగింది. తగినంతమంది సిబ్బందిని నియమించాలి.

సరిపోని పడకలు

మహబూబాబాద్‌లోని స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో 40 పడకలు, గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 21 పడకలను కొవిడ్‌ చికిత్సల కోసం ఏర్పాటు చేశారు. అన్నింటికీ ప్రాణవాయువు సౌకర్యం కల్పించారు. రెండుచోట్లకూ ఖమ్మం నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లు రోజూ సరఫరా అవుతున్నాయి. ఇటీవల జిల్లాలో కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పడకలు దొరక్క కొవిడ్‌ బాధితులు ప్రైవేటుకో లేదా ఖమ్మంకో, వరంగల్‌కో వెళ్లాల్సి వస్తోంది.

ఏం కావాలంటే...

కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పడకల సంఖ్య పెంచాలి. కొవిడ్‌ బాధితులకు స్థానికంగానే చికిత్స అందించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలుండడంతో.. అందుకు తగ్గట్లుగా గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు సరఫరా చేయాలి. మహబూబాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రిలో 20 మంది స్టాఫ్‌నర్సులు, కనీసం ముగ్గురు మత్తుమందు నిపుణులు, జనరల్‌ ఫిజీషియన్లు, పల్మనాలజిస్టులు కావాలి. అవసరాలకు తగ్గట్లుగా కింది స్థాయి సిబ్బంది నియామకాలను కూడా చేపట్టాలి.

నిరుపయోగంగా వెంటిలేటర్లు

జనగామ టౌన్‌: జిల్లా ఆసుపత్రిలో 84 పడకలను కొవిడ్‌కు కేటాయించారు. ఇందులో 68 సాధారణ, 16 ఐసీయూ పడకలున్నాయి. ఐసీయూలో 8 వెంటిలేటర్‌ బెడ్స్‌ ఉన్నాయి. అయితే ఈ వెంటిలేటర్‌ పడకలను ప్రస్తుతం వినియోగించడం లేదు. వీటిని నిర్వహించే టెక్నీషియన్లు లేరు. ఇక్కడ క్రమేణా రోగుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జనగామ ఆసుపత్రికి ప్రాణవాయువును నిల్వ చేసుకునే ట్యాంకును మంజూరు చేశారు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆసుపత్రిలో 12 మంది వైద్యులు, 20 మంది స్టాఫ్‌ నర్సులు కొవిడ్‌ వార్డులో సేవలందిస్తున్నారు.

ఇవి ఉండాలి...
అవసరాలకు తగ్గట్లుగా మరిన్ని ఆక్సిజన్‌ సిలిండర్లను మంజూరు చేయాలి. ఇప్పటికే సేవలందిస్తున్న సిబ్బందిలో 12 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. మరింత మంది వైద్యులను, స్టాఫ్‌ నర్సులను, వెంటిలేటర్‌ టెక్నీషియన్లను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నియమించాలి.

పెరుగుతున్న తాకిడి

మెదక్‌: మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ వార్డుకు రోగుల తాకిడి పెరుగుతోంది. 140 పడకలతో ఈ వార్డును ఏర్పాటు చేయగా, ఇందులో వంద పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యముంది. పది పడకలతో ఐసీయూ ఏర్పాటు చేశారు. ఇందులో మూడింటికి వెంటిలేటర్‌ సదుపాయం ఉంది. ప్రస్తుతం 74 మంది చికిత్స పొందుతున్నారు. గత వారమైతే అన్ని పడకలూ నిండిపోయాయి. ఇక్కడ సేవల్లో పాల్గొంటున్న సిబ్బంది కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. ఇటీవల ఆసుపత్రిలోని 14 మంది వైద్యసిబ్బందికీ పాజిటివ్‌గా తేలింది. ఇక్కడ 140 ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉండగా.. ఇటీవలే కొత్తగా ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రానికి అనుమతి లభించింది.

అవసరాలు ఇలా..
ప్రస్తుతం ఆసుపత్రిలో 25 మంది వైద్యులు పనిచేస్తుండగా.. ఇక్కడ మరో 20 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 50 మంది నర్సులు పనిచేయాల్సిన చోట ప్రస్తుతం 24 మందే సేవలందిస్తున్నారు.

పాడైన ప్రాణవాయు పరికరాలు

నాగర్‌కర్నూల్‌: ఇక్కడి ప్రాంతీయ ఆసుపత్రిలో 2 వెంటిలేటర్లున్నాయి. అవి రెండేళ్ల కిందట పాడయ్యాయి. ఇప్పటి వరకూ అలాగే పడి ఉన్నాయి. వాటి అవసరం ఉన్న రోగులు మహబూబ్‌నగర్‌కో, హైదరాబాద్‌కో వెళ్లాల్సి వస్తోంది. ఈ ఆసుపత్రిలో 50 పడకలు కొవిడ్‌కు కేటాయించారు. గద్వాల ఆసుపత్రిలో 7 వెంటిలేటర్లు పనిచేస్తున్నాయి. ఇక్కడ 110 పడకలతో కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్నారు.

పోస్టుల భర్తీనే కీలకం
రోగుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ వైద్యసిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి. అవసరాలకు తగ్గట్లుగా అదనంగా నియమించాలి.

ఇదీ చూడండి:లాక్‌డౌన్‌ విధించడంతో తప్పని వలసకూలీల కష్టాలు

ABOUT THE AUTHOR

...view details