పెట్రోల్ లీటర్ ధర రూ.100 కాగానే.. బైక్ పక్కన ఆపి.. శిరస్త్రాణం తీసి.. పైకి చూపండీ.. క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ సెంచరీ చేయగానే ఇదే చేస్తాడు. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్న జోక్. ప్రస్తుతం పెరుగుతోన్న ఇంధన ధరలు దీన్ని నిజం చేస్తాయనే అభిప్రాయాన్ని మరింత బలపడేలా చేసింది. బడ్జెట్‌లో పేదవర్గాలకు అనుకున్నంత మేలు జరగలేదు. మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గలేదు. వేతన జీవులకూ ఊరటనివ్వలేదు. కరోనా మహమ్మారి సృష్టించిన కష్టాల నుంచి క్రమంగా కోలుకుంటున్న సమయంలో బడ్జెట్ గుదిబండ మరింత భారంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
నగరానికి ఎలక్ట్రిక్ బస్సులు
నానాటికీ పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందుకు ప్రజారవాణా పెరుగుదలతోనే పట్టణాల్లో కాలుష్యానికి చెక్ పెట్టాలని భావించింది. అందుకే ఈసారి కేంద్ర బడ్జెట్‌లో వాయు కాలుష్య నియంత్రణకు పెద్దపీట వేసింది. ఏకంగా రూ. 2,270 కోట్లను కేటాయించింది. ప్రజారవాణా పెరుగుదలలో ఏకంగా 20వేల ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చడానికి సిద్ధమౌతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ బస్సులలో నగరం వాటా ఎంత ఉంటుందనేది తేలాల్సిఉంది.
హైస్పీడ్ రైళ్లు మరిచారు
బడ్జెట్‌లో భాగ్యనగరానికి సంబంధించి కొత్త రైళ్ల ప్రకటన లేదు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, ముంబయి, విజయవాడ, విశాఖపట్నం తదితర అత్యంత రద్దీ ఉండే మార్గాల్లో హైస్పీడ్ రైళ్ల ఊసే లేకుండా పోయింది. చర్లపల్లి టర్మినల్, నాగులపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి కూడా అగమ్యగోచరమే. రైల్వే కేటాయింపులకు సంబంధించి పింక్ బుక్‌లో పేర్కొంటారు. మంగళవారం ఆ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అత్యంత రద్దీతో పాటు.. వినియోగం ఉన్న మార్గాల్లో భద్రత కోసం ‘యాంటీ కొలిజన్ సిస్టమ్’ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
15 లక్షల వాహనాలు.. తుక్కు తుక్కు!
బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన వాహనాల తుక్కు వాహనాల చట్టంతో గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు 15-20 లక్షల వాహనాలు తుక్కు కింద మారనున్నాయని రవాణా శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతోపాటు పర్యావరణానికి పెద్ద ఊరట లభించనుందని భావిస్తున్నారు. నగరంలో 55 లక్షల నుంచి 60 లక్షల వాహనాలు తిరుగుతుండగా ఇందులో 15 లక్షల వాహనాలకుపైగా 15-20 ఏళ్లు గడిచిపోయినట్లు తెలుస్తోంది. కొత్త చట్టంతో ఇలాంటి వాహనాలు ఇక నుంచి రోడ్లపైకి రాకుండా అడ్డుకట్ట పడుతుంది.
కొత్త ఎస్టీపీలకు భరోసా
తాజా బడ్జెట్‌లో నగరాల్లో మురుగు శుద్ధికి ప్రాధాన్యం దక్కడంతో వాయిదా పడిన ఎస్టీపీలకు మోక్షం లభించనుందని జలమండలి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో తాగునీటి సరఫరా అవుటర్ రింగ్‌రోడ్డు వరకు పెరిగి మురుగు ఉత్పత్తి రెండింతలకు చేరుకుంది. గ్రేటర్ వ్యాప్తంగా నిత్యం 1,800 మిలియన్ లీటర్ల మురుగు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 40 శాతమే శుద్ధి చేస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా కొత్తగా 65 ఎస్టీపీలను నిర్మించాలని జలమండలి ప్రణాళిక సిద్ధం చేసింది.
నిత్యావసర ధరలకు రెక్కలు?
కోటి దాటుతున్న నగర జనాభా. 40 లక్షలకు పైగా కుటుంబాలకు ఈ సారి బడ్జెట్ ఉసూరుమనిపించింది. కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు, సంస్థలకు నోచుకోలేదు. రవాణా ఛార్జీల పెంపుతో కూరగాయలు, పాలు తదితర నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశానికి తాకేలా చేయనున్నాయంటున్నారు ఈసీఐఎల్‌కు చెందిన గృహిణి లతాదేవి. ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, ఆసుపత్రి ఖర్చులు గతంలో ఎన్నడూ లేనంతగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఐటీ నిపుణుడు గణేష్ తెలిపారు.
మెట్రో రెండో దశకు ఏదీ దిశ?