YS Sharmila Padayatra: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్రకు వరంగల్ పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. వ్యక్తిగత దూషణలు చేయరాదని, ఇతర పార్టీలు, కులాలు, మతాలను కించపరుస్తూ.. వ్యాఖ్యలు చేయరాదని పేర్కొంటూ 14 షరతలతో అనుమతిచ్చారు. వచ్చే నెల 2 నుంచి 18 వరకు నిర్వహించుకోవడానికి అనుమతించారు. వరంగల్ జిల్లా శంకరమ్మ తండా నుంచి.. నెక్కొండ, పర్వతగరి, వర్ధన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట, ఘన్పూర్, నర్మెట్ట, జనగామ, దేవరుప్పుల, పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం వరకూ యాత్ర చేసేందుకు వరంగల్ సీపీ అనుమతించారు.
బీఆర్‌ఎస్ శ్రేణుల దాడులు.. పరస్పర ఘర్షణలు జరిగి ఉద్రిక్తతలకు దారి తీయడంతో.. షర్మిల ప్రజా ప్రస్ధానం పాదయాత్రను గత ఏడాది నవంబర్ 28న వరంగల్ జిల్లా శంకరమ్మ తండా వద్ద నిలిపివేశారు. షర్మిల ప్రయాణించే కారవాన్పై పెట్రోల్ పోసి దాడి చేసి తగులబెట్టారు. చివరకు శాంతి భద్రతల విఘాతం కలుగుతోందంటూ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఆ మరునాడు 29న ధ్వంసం చేసిన వాహనాలతో హైదరాబాద్ ప్రగతి భవన్ వైపు షర్మిల వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.