నీటిపారుదల శాఖలో పునర్విభజనపై ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసి గత డిసెంబరు ఆఖరుకు ఓ కొలిక్కి తెచ్చింది. పరిపాలనా సౌలభ్యం ఉండేలా ఏ చీఫ్ ఇంజినీర్ కేంద్రం ఎక్కడో నిర్ణయించింది. ఇంజినీర్ ఇన్ చీఫ్‌ల స్థాయిలో కూడా మార్పులు చేసి పని విభజనపై స్పష్టత ఇచ్చింది. దీనికి తగ్గట్లుగా 2020 డిసెంబరు 30న నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
నీటిపారుదల శాఖలో చిత్రవిచిత్రాలు.. మూణ్నెల్లలో మూడుసార్లు బదిలీ
సీనియర్ ఇంజినీర్లతో నీటిపారుదల శాఖ బంతాట ఆడుతోంది. ఒక చీఫ్ ఇంజినీర్‌కు మూణ్నెల్లలో మూడుసార్లు బదిలీ అయింది. ఇలాంటి పరిస్థితే అనేకమందిది. మరోవైపు పదవీ విరమణ చేసి సర్వీసు పొడిగింపులో ఉన్న వారిని మళ్లీ పొడిగించడం, వారిని కీలకమైన స్థానాల్లో నియమిస్తుండటం కూడా చర్చనీయాంశమవుతోంది.
ఎప్పుడు ఎక్కడో తెలియని పరిస్థితి
పునర్విభజన తర్వాత ఆరుగురు ఇంజినీర్ ఇన్ చీఫ్‌లకు, మరో 22 మంది చీఫ్ ఇంజినీర్లకు పోస్టింగులు ఇచ్చారు. డిసెంబరు 30న బదిలీలు, నియామకాలు జరగ్గా, ఈ మూడు నెలల్లోనే మళ్లీ మళ్లీ బదిలీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏ చీఫ్ ఇంజినీర్‌ను ఎక్కడ నియమిస్తారో, ఎన్నాళ్లుంచుతారో, ఎప్పుడు బదిలీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని ఆ శాఖ వర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.
ఉదాహరణకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్‌లో ఎస్‌ఈగా ఉన్న మోహన్‌కుమార్‌ను పదోన్నతిపై డిసెంబరు 30న నాగర్‌కర్నూల్ చీఫ్ ఇంజినీర్‌గా నియమించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులన్నీ ఈ సీఈ పరిధిలోకి వస్తాయి. జనవరి 30న ఈయన్ను నాగర్‌కర్నూల్ నుంచి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) చీఫ్ ఇంజినీర్‌గా మార్చారు. మళ్లీ ఇక్కడి నుంచి బదిలీ చేసి పోస్టింగు కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందిగా కోరుతూ ఈ నెల 29న (సోమవారం) మరో మెమో జారీ చేశారు.
- అదే విధంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇన్‌ఛార్జి చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న వి.రమేష్‌ను మొదట మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల సీఈగా.. తర్వాత నాగర్‌కర్నూల్‌కు.. తాజాగా మళ్లీ మహబూబ్‌నగర్‌కు పంపారు.
- తొలుత ఇచ్చిన పోస్టింగులో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సీఈగా ఉన్న టి.శ్రీనివాస్‌ను తర్వాత మహబూబ్‌నగర్ సీఈగా బదిలీ చేశారు. మళ్లీ ఇప్పుడు మహబూబ్‌నగర్ నుంచా సీడీవోకు మార్చారు.
- కొత్తగూడెం చీఫ్ ఇంజినీర్‌గా నియమించిన వెంకటరమణను జనవరి 30న క్వాలిటీ కంట్రోల్ సీఈగా బదిలీ చేశారు.
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సర్కిల్-2 ఎస్‌ఈగా ఉన్న ఎ.ఎస్.ఎన్.రెడ్డిని ముందు భువనగిరి ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈగా బదిలీ చేశారు. తర్వాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సర్కిల్-2, నాగర్‌కర్నూలుకు మార్చారు.
- పదవీ విరమణ చేసి సర్వీసు పొడిగింపుపై ఉన్న చిన్న నీటి వనరుల(కృష్ణాబేసిన్) సీఈగా ఉన్న హమీద్‌ఖాన్‌ను ముందు హైదరాబాద్ చీఫ్ ఇంజినీర్(ఎంక్వైరీస్)గా నియమించారు. ఈయనకు పొడిగించిన సర్వీసు ఈ నెల 31న ముగియనుండగా, మళ్లీ రెండేళ్లు ఇస్తూ 29న ఉత్తర్వు జారీ చేయడంతోపాటు నాగర్‌కర్నూల్ చీఫ్ ఇంజినీర్‌గా నియమించారు.
- హమీద్‌ఖాన్ మాదిరి పొడిగింపులో ఉన్న మరో ఇద్దరి సర్వీసు కూడా పెంచే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నెల క్రితం రామగుండం ఇంజినీర్ ఇన్ చీఫ్ (కాళేశ్వరం) వెంకటేశ్వర్లుకు కూడా ప్రభుత్వం పొడిగింపు ఇచ్చింది. ఈయన అప్పటికే పొడిగింపులో ఉన్నారు.
- ఇదీ చూడండి :ఉన్నతాధికారుల పీఏనంటూ మోసాలు: సీపీ అంజనీకుమార్