హైదరాబాద్ కాచిగూడలో సరిగ్గా ఏడాది క్రితం.. నవంబరు 11న జరిగిన రైలు ప్రమాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. కర్నూలు నుంచి వస్తున్న హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ నడుపుతున్న లోకోపైలట్ తీవ్రంగా గాయపడి.. తర్వాత చికిత్స పొందుతూ చనిపోయాడు. స్టేషన్లో ఆగేందుకు నెమ్మదిగా రైల్వే ట్రాక్ మారుతూ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ వస్తుండగా అప్పుడే కాచిగూడ నుంచి ఫలక్‌నుమాకు ఎంఎంటీఎస్ బయలుదేరింది. రెండు రైళ్లు తక్కువ వేగంతో ఉండడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. కాని ఆ శబ్దానికి ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణించేవారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఎంఎంటీఎస్ లోకో పైలట్ సిగ్నల్ గమనించకుండా ముందుకు తీసుకెళ్లాడని రైల్వే నిర్ధారించింది. కాని ఈ ప్రమాదం దక్షిణమధ్య రైల్వేకు అనేక పాఠాలు నేర్పింది. రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా.. గతంలో చేసిన టికాస్ (ట్రైన్ కొల్యూషన్ అవాయిడెన్స్ సిస్టమ్) ప్రయోగాలను తెరమీదకు తెచ్చింది. ఈ వ్యవస్థను ఎంఎంటీఎస్‌లకు అమర్చితే ఎంతో ప్రయోజనమని రైల్వే ప్రయాణికుల సంఘం ప్రతినిధులు సూచిస్తున్నారు.
పట్టాలెక్కిన వ్యవస్థ..
టికాస్ అంటే ఎదురెదురుగా కాని.. వెనుక నుంచి కాని రెండు రైళ్లు ఢీకొనకుండా నియంత్రించే విధానం. గతంలో లింగంపల్లి-వికారాబాద్-వాడి మధ్య టికాస్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘టికాస్’ను భారతీయ రైల్వే అందిపుచ్చుకోవాలని కూడా భావించింది. ఈ క్రమంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ద.మ. రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలోని ముత్కేడ్- సికింద్రాబాద్ సెక్షనులో ఉమ్రి- సివున్‌గావ్ స్టేషన్ల మధ్య అక్టోబరు 30న 21.5 కిలోమీటర్ల పొడవు మేరకు టికాస్ వ్యవస్థను ప్రారంభించింది. రైల్వే ట్రాక్‌పై సిగ్నలింగ్‌తోపాటు అలార్మింగ్ (హెచ్చరిక) వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. దీనికి తోడు రైలు ఇంజిన్‌కు ముందు భాగంలో దీనిని అమర్చడం వల్ల ఎదురుగా రైలు వస్తే లోకోపైలట్‌ను హెచ్చరించడమే కాకుండా.. దానంతట అదే ఆగిపోతుంది.