శిరస్త్రాణం కచ్చితంగా ధరించాలన్న నిబంధనను ఉల్లంఘించే ద్విచక్రవాహనదారులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా మారని వారికి.. అంతకు ముందు ఒక్క చలానా పెండింగ్‌లో ఉన్నా రెట్టింపు జరిమానా విధిస్తున్నారు.
మృతుల్లో ద్విచక్రవాహనదారులే అధికం
నిత్యం ఎక్కడో చోట నగరంలోని రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. గతేడాది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల బారిన పడి 861 మంది దుర్మరణం చెందారు. వీరిలో 470 మంది ద్విచక్రవాహనదారులే కావడం గమనార్హం. 100 మంది వాహనంపై వెనుక కూర్చున్న వారు. ఈ లెక్కన చూస్తే మొత్తం మృతుల్లో సగానికి పైగా(55 శాతం) ద్విచక్రవాహనదారులే ఉంటున్నారని స్పష్టమవుతోంది. శిరస్త్రాణం ధరించకపోవడంతో వివిధ కారణాలతో కిందపడినప్పుడు తలకు తీవ్ర గాయాలై దుర్మరణం చెందుతున్నారని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇటీవల చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.
పెండింగ్ చలాన్లుంటే..
ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల నివారణపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. శిరస్త్రాణం లేకుండా రోడ్డెక్కితే రూ.100 జరిమానా విధిస్తున్నా కొందరు మారడం లేదు. ఎందుకిలా అంటూ పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. జరిమానా తక్కువే కదా.. కట్టుకోవచ్చులే అంటూ కొందరు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెట్టింపు జరిమానా విధించాలని పోలీసులు నిర్ణయించారు. శిరస్త్రాణం వినియోగానికి సంబంధించి పెండింగ్ చలాన్లు ఏమైనా ఉన్నాయా అంటూ పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఉంటే రెట్టింపు అంటే రూ.200 జరిమానా(పన్నులతో కలిపి రూ.235) వేస్తున్నారు. పెండింగ్ చలాన్లను చెల్లించకుండా ఎన్నిసార్లు పట్టుపడితే.. అన్నిసార్లు రెట్టింపు వసూలు చేస్తారు.