Dalit Bandhu scheme in Telangana : దళితబంధు పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపికలోనూ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు అర్హులైన దళిత కుటుంబాలను గుర్తించి.. ఆ పథకాన్ని అమలు చేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తొలి విడతలో ఎమ్మెల్యేలు నేరుగా లబ్ధిదారుల్ని ఎంపిక చేయగా.. సర్కార్ తాజా ఆదేశాలతో రెండో విడతలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుంది.
Telangana Dalita Bandhu 2023 :దళిత జాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే సంకల్పంతో రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి నాంది పలికారు. అందులో భాగంగా ప్రతిదళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి.. వారి పురోగతిని చూడాలని సంకల్పించారు. వారు ఆ నగదుతో వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టి లాభదాయక వ్యాపారం చేసి.. అందరితో సమానంగా ఉండాలని సీఎం కోరుకున్నారు.
Second Phase Dalit Bandhu in Telangana : గ్రామాలవారీగా అర్హులైన దళిత కుటుంబాలతో జాబితా రూపొందించాలని.. అలాగే ఎమ్మెల్యేల ఆమోదం అనంతరం.. ఆయా కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని ప్రభుత్వం తెలిపింది. అర్హులైన కుటుంబాలను ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేయాలని స్పష్టం చేసింది. తొలి విడతలో 32 వేల మందికి ప్రభుత్వం ఈ పథకం అమలు చేసింది. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1.3 లక్షల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో యూనిట్లు మంజూరు చేస్తామని జూన్‌లో వెల్లడించింది. అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 మంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో (హుజూరాబాద్ మినహా) 1,29,800 మందికి యూనిట్ల మంజూరుకు జాబితాలు రూపొందించాలని కలెక్టర్లకు తెలిపింది.