తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యాసంస్థలు ఇప్పుడే తెరవలేం.. దసరా తర్వాతే నిర్ణయం' - పాఠశాలలు

అన్‌లాక్‌ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. దసరా తర్వాత లేదా వచ్చే నెలలో విద్యాసంస్థలు తెరవాలని విద్య, సంక్షేమ శాఖల ఉన్నత స్థాయి సమావేశం అభిప్రాయపడింది. ముందుగా ఉన్నత విద్య కళాశాలలు, ఆ తర్వాత పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అప్పటివరకు ఆన్‌లైన్ విద్య కొనసాగించాలని అధికారులకు సూచించారు.

schools-will-not-be-able-to-start-until-november-15th
విద్యాసంస్థలు ఇప్పుడే తెరవలేం: మంత్రులు

By

Published : Oct 8, 2020, 5:20 AM IST

Updated : Oct 8, 2020, 6:51 AM IST

రాష్ట్రంలో ఈనెల 15 నుంచి విద్యాసంస్థల ప్రారంభం సాధ్యం కాదని విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాఠోడ్, గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కేంద్రం సడలింపులిచ్చినప్పటికీ బతుకమ్మ, దసరా పండుగల తర్వాత దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేరళలో ఓనం పండుగ అనంతరం కరోనా మళ్లీ ఉద్ధృతరూపం దాల్చినందున అప్రమత్తత వహించడం అవసరమన్నారు. యూజీసీ, ఏఐసీటీయూ నిర్ణయాలకు అనుగుణంగా ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కళాశాలలు.. నవంబర్‌ 1 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. పండుగల తర్వాత పరిస్థితిని బట్టి పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఇతర విద్యాసంస్థల ప్రారంభంపై అధికారులు విధివిధానాలు రూపొందించాలని, వాటి ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

రెండు విధానాల్లో బోధన

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాల నిర్వహణపై విద్యాశాఖతో పాటు సంక్షేమశాఖలు సమన్వయంతో ఉమ్మడిగా నిబంధనలు రూపొందించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు సెలవులు ఉన్నందున విద్యార్థుల దృష్టి చదువు నుంచి దారి మళ్లకుండా చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థలు ప్రారంభమయ్యాక విద్యార్థుల ఆరోగ్యంపై..... ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళిక తయారు చేయాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది. ఆన్‌లైన్ పాఠాలు ప్రతీ విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. విద్యా సంస్థలు తెరిచినప్పటికీ... కొంతకాలం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాల్లో బోధన కొనసాగించాల్సి ఉంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు.

86 శాతం మంది ఆన్‌లైన్ పాఠాలు వింటున్నారు

రాష్ట్రంలో 86 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలు వింటున్నట్లు సర్వేలో తేలిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలలను స్థానిక సంస్థలకు అప్పగించాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో... దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి కోరారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

Last Updated : Oct 8, 2020, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details